కాంగ్రెస్‌తో చేతులు కలిపి ప్రాంతీయ పార్టీలు సరిదిద్దుకోలేని తప్పు చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు రామ్మనోహర్ లోహియా తమకు ఆదర్శం అని చెప్పుకుంటాయని, ఆయన సిద్ధాంతాలు ఒక్కటీ పాటించవని ఎద్దేవా చేశారు.
రామ్ మనోహర్ లోహియా 109వ జయంతిని పురస్కరించుకుని నేడు మోదీ తన బ్లాగులో సందేశమిచ్చారు.
"చాలా పార్టీలు రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలు తమకు ఆదర్శమని చెబుతుంటాయి. కానీ అదంతా అబద్ధం. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్‌తో మహాకూటములు, మిలావత్లు ఏర్పరుచుకుంటున్నాయి." - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్(ఎస్), శరద్‌యాదవ్ నేతృత్వంలోని లోక్ తాంత్రిక్ జనతాదళ్... లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆర్జేడీలో కలుస్తాయని జోస్యం చెప్పారు. ఈ పార్టీలు తమని తాము సామ్యవాద పార్టీలుగా అభివర్ణించుకుంటున్నాయని విమర్శించారు మోదీ.
మనోహర్ లోహియా సిద్ధాంతాలను అనుసరిస్తున్న ఏకైక కూటమి ఎన్డీయేదేనని, ఈ సమయంలో ఆయన ఉండి ఉంటే గర్వపడేవారని మోదీ అన్నారు.
వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ప్రవేశం, రైతులకు చేయూతనిచ్చే పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి, కృషి సంచాయ్ యోజన, ఈ-నామ్, ఆరోగ్య కార్డులు లాంటి పథకాలు ప్రవేశ పెట్టడానికి మనోహార్ లోహియానే తమకు ఆదర్శమని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు.
లింగ సమానత్వం కోసం లోహియా పోరాడారని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ హాయంలో వ్యవసాయం, పరిశ్రమలు, రక్షణ రంగం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని లోహియా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు మోదీ. వారసత్వ పాలనకు రామ్ మనోహర్ లోహియా వ్యతిరేకమని మోదీ గుర్తు చేశారు.
అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించడం, అధికారం దక్కాక బడుగు, బలహీన వర్గాలను దోచుకోవటమే కొన్ని పార్టీల ప్రధాన లక్ష్యమని మోదీ ఆరోపించారు.