2019లో రెండోసారి గద్దెనెక్కిన ఎన్డీఏ సర్కారు.. శనివారం నాటికి ఏడాది పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. భాజపా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలను వారు ప్రతి ఇంటికి చేరవేసే పనిలో ఉన్నారని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
'ఈ చరిత్రాత్మకమైన రోజున కోట్ల సంఖ్యలో ఉన్న భాజపా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత ఆరు సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా చూస్తున్నారు. మీ కృషి, త్యాగాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని ట్వీట్ చేశారు. అలాగే '1ఇయర్ఆఫ్‌మోదీ2' హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు.
మొదటి ఏడాది మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తుచేస్తూ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మోదీ.. ప్రజలనుద్దేశించి బహిరంగ లేఖ రాశారు. గతేడాది భారత ప్రజాస్వామ్యంలో 'గోల్డెన్ ఛాప్టర్' ప్రారంభమైందన్నారు. ఆ ఎన్నికల్లో భారత ప్రజలు ప్రజాస్వామ్య శక్తిని ప్రపంచానికి చాటారన్నారు.