ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని నిరంతరం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ కర్మ యోగి’కి శ్రీకారం చుడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ కొత్త వ్యవస్థకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని స్థాయుల ఉద్యోగుల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెరగడానికి, ‘తగిన వ్యక్తికి తగిన పని’ అప్పగించడానికి ఇది ఉపయోగపడుతుంది. వ్యవస్థాగత సమర్థత పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. దీనికోసం ఒక ప్రత్యేక అవసర సంస్థ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేస్తారు. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ మంత్రి జితేంద్ర సింగ్ విలేకర్లతో మాట్లాడుతూ కొత్త వ్యవస్థ లక్ష్యాలను వివరించారు.
ఈ ఆలోచనకు ఆనాడే బీజం
"ప్రభుత్వ ఉద్యోగిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే 'సివిల్ సర్వీసులలో సామర్థ్య పెంపునకు జాతీయ కార్యక్రమం' (మిషన్ కర్మయోగి) ముఖ్యోద్దేశం. 2017లో ముస్సోరీలోని ఐఏఎస్‌ల శిక్షణ కేంద్రాన్ని ప్రధాని సందర్శించినప్పుడు ఈ ఆలోచనకు బీజం పడింది. అక్కడ రెండు రోజులపాటు బసచేసి శిక్షణార్థులతో మాట్లాడినప్పుడు శిక్షణ విధానం మార్చాలన్న విషయం అర్థమయింది. తమతమ విభాగాలకే పరిమితమయ్యేలా కాకుండా సంపూర్ణ దృక్పథంతో అందరు సివిల్ సర్వెంట్లు పనిచేయాల్సి ఉందని గుర్తించారు. పూర్తి మథనం చేసి ఈ కొత్త వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఇదివరకు శిక్షణ కేవలం నిబంధనల (రూల్) ఆధారంగా ఉండేది. ఇప్పుడు అది ఉద్యోగి పాత్ర (రోల్) ఆధారితంగా ఉంటుంది. ఉన్నత చదువులు, సామర్థ్యం పెంచుకొనే అవకాశాలు కొందరు అధికారులకే ఉండేవి. ఇప్పుడు అందరికీ అవి అందుబాటులోకి వస్తాయి. ఇదివరకు అఖిల భారత సేవలకే పరిమితమైన మధ్యంతర శిక్షణ (మిడ్ కెరీర్ ట్రైనింగ్)ను ఇప్పుడు అన్ని సర్వీసులకూ, అన్నిస్థాయుల్లోని అధికారులకూ వర్తింపజేస్తారు. దీని నిమిత్తం డీటీహెచ్‌లో కర్మయోగి టీవీ ఛానల్ ఏర్పాటుచేస్తారు. ప్రతిఒక్క అధికారి పనితీరు డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. నియామకాల విషయంలో పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉద్యోగుల పనితీరుపై పూర్తిగా శాస్త్రీయ సమీక్ష జరుగుతుంది" అని మంత్రి వివరించారు.
వ్యవస్థ రూపం ఇలా...
- శిక్షణ కార్యక్రమం పర్యవేక్షణకు 'ప్రధానమంత్రి మానవ వనరుల మండలి' (పీఎం-హెచ్‌ఆర్ కౌన్సిల్) పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. ప్రధాని అధ్యక్షతన పనిచేసే ఈ మండలిలో కేంద్ర కేబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విభిన్న రంగాల దేశ, విదేశీ నిపుణులు, సివిల్ సర్వీస్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో సమన్వయ విభాగం ఉంటుంది. అది వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుంది. సివిల్ సర్వీస్ సామర్థ్య పెంపు ప్రణాళికను ఆమోదించి, పర్యవేక్షిస్తుంది.
- మిషన్ కర్మయోగి నిర్వహణ కోసం స్వయం ప్రతిపత్తితో పనిచేసే 'కెపాసిటీ బిల్డింగ్ కమిషన్'ను ఏర్పాటుచేస్తారు. ఇది ప్రామాణిక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. దేశంలోని అన్ని శిక్షణ సంస్థలు దీని పరిధిలోకి వస్తాయి. వాటి ఆర్థిక, మానవ వనరులను ఇదే పర్యవేక్షిస్తుంది. అభివృద్ధి ఆకాంక్షలు, లక్ష్యాలు, జాతీయ ప్రాధాన్యాలు, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఒకే విధానం అనుసరించేలా మార్గనిర్దేశం చేస్తుంది.
- డిజిటల్ వనరుల నిర్వహణకు, ఆన్‌లైన్ శిక్షణకు కంపెనీల చట్టం కింద ఏర్పాటయ్యే ఎస్‌పీవీ ద్వారా ప్రపంచంలో అత్యుత్తమ స్థాయి విషయాన్ని (కంటెంట్) సేకరించి ప్రభుత్వంలో అందరికీ అందుబాటులో ఉంచుతుంది. ఈ మొత్తం వ్యవస్థ కోసం అయిదేళ్లలో రూ.510 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీని నిమిత్తం ప్రతి సివిల్ సర్వెంట్ నుంచి ఏటా రూ.431 వసూలుచేస్తారు. ఎస్పీవీని రాష్ట్రాలు, ఇతర దేశాలకూ అందుబాటులో ఉంచుతారు. ఆసక్తి ఉన్న ఎవరైనా కేంద్రంతో సంప్రదించి దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఒకే దృక్పథంతో ఆలోచించేలా శిక్షణ
దేశీయ అవసరాలకు తగ్గట్టు ఉద్యోగుల సామర్థ్యాలను పెంచేలా నిబంధనలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యవస్థ కారణంగా ఉద్యోగులు తమతమ శాఖలవారీగానే ఆలోచిస్తున్నారు తప్పిస్తే విశాల జాతీయ దృక్పథంతో చూడటంలేదు. ఇకమీదట ఉద్యోగులంతా ఒకేలా పనిచేసేలా శిక్షణ ఇస్తారు. ఇది జవాబుదారీతనాన్ని, పారదర్శకతను తీసుకొస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగుల సంస్కరణగా ఇది నిలవనుంది. సులభ జీవనం, సులభతర వాణిజ్యం మరింత మెరుగుపడటం, ప్రభుత్వం-ప్రజల మధ్య అగాధం తగ్గడమే ఈ సంస్కరణ అంతిమ లక్ష్యం.
ప్రభుత్వంలో కిందిస్థాయి ఉద్యోగి నుంచి కేంద్ర కేబినెట్ కార్యదర్శి వరకు పోషించాల్సిన పాత్రను నిర్వచించి, సమకూర్చుకోవాల్సిన సామర్థ్యాల గురించి చెబుతారు. వాటిని పెంచడానికి 'ఐగాట్ కర్మయోగి డిజిటల్ ప్లాట్‌ఫామ్' ద్వారా శిక్షణ ఇస్తారు.
శిక్షణానంతరం ఉద్యోగాన్ని ఖాయం చేయడం, వారికి బాధ్యతలు కేటాయించడం, ఖాళీలను ప్రకటించడం వంటివన్నీ క్రమేపీ ఒకే వ్యవస్థ కిందికి వస్తాయి.
ప్రభుత్వం ఆశిస్తున్న సామర్థ్యాలు..
- సృజనాత్మకత
- వినూత్నత
- సరళత
- వృత్తి నైపుణ్యత
- ప్రగతిశీలత
- ఉత్సాహం
- సమర్థత
- పారదర్శకత
- సాంకేతికత
- నిర్మాణాత్మకత
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 46 లక్షలు
ఐదేళ్లలో శిక్షణకయ్యే వ్యయం రూ.510.86 కోట్లు
ప్రతి అధికారికీ తప్పనిసరి
ఉద్యోగంలో భాగంగా మధ్యలో శిక్షణ పొందడం అన్ని సేవల్లో ఉన్న ప్రతి ఒక్క అధికారికి తప్పనిసరి. ఎవరికి ఏ ఉద్యోగం ఇవ్వాలో ఎంచుకునేలా డేటా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పనితీరు మదింపు వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి.
- జితేంద్ర సింగ్, కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి
ఇదీ చూడండి: పౌర సేవల్లో 'మిషన్ కర్మయోగి' కీలక సంస్కరణ: మోదీ