మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తిని కుటుంబానికి దూరం చేసింది విధి. కానీ 8 ఏళ్ల తరువాత తిరిగి ఇంటికి చేర్చింది మానవత్వం.
కేరళకు చెందిన ఉమర్ కోయ 2012లో తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా లాభం లేకపోయింది. ఒడిశాకు ఎలా చేరుకున్నాడో గానీ.. కొన్నేళ్లపాటు సుందర్‌గఢ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దే కాలం వెల్లదీశాడు.
ఎవరైనా దయతలచి ఆహారం పెడితే తినేవాడు.. లేదంటే ఆకలితోనే నిద్రపోయేవాడు. కనీసం జబ్బు చేస్తే పట్టించుకునే నాథుడు కూడా లేడు. అలా, అత్యంత దుర్భర జీవితం గడుపుతున్న ఉమర్‌ను కొన్ని నెలల క్రితం సామాజిక కార్యకర్త శీజూ థామస్ చేరదీశాడు.
మానసిక స్థితి సరిగ్గా లేని ఉమర్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాడు. కౌన్సిలింగ్ ఇప్పించాడు. ఉమర్ స్వస్థలం కేరళ అని తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. అలా 8 ఏళ్ల క్రితం విడిపోయి... శీజూ థామస్ సహృదయంతో తిరిగి కలుసుకున్నారు.
ఇక తిరిగి రాడేమో అనుకున్న సోదరుడు వచ్చేసరికి ఆనందంలో మునిగిపోయారు ఉమర్ అన్నాదమ్ములు.
ఇదీ చదవండి:వైరల్: ఘాట్ రోడ్లో రాంగ్ రూట్లో వెళ్తే ఇంతే...