ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపుర్‌లో ఓ యువకుడు వింత పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ప్రమాదవశాత్తు ఓ సర్పం అతని జీన్స్ ప్యాంటులో దూరిన కారణంగా దాదాపు ఏడు గంటలపాటు కదలకుండా నిల్చున్నాడు.
మీర్జాపూర్ పరిధిలోని సికందర్పుర్లో విద్యుత్ స్తంభాలు, తీగల ఏర్పాటు పనులు చేస్తున్నారు. ఈ పనులు చేసేందుకు వచ్చిన కార్మికులు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో రాత్రిపూట నిద్రిస్తున్నారు. అయితే అర్ధరాత్రి వేళ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో.. ఓ పెద్ద పాము ఓ కార్మికుని జీన్స్ ప్యాంటులోకి దూరింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన యువకుడు వెంటనే లేచి పక్కనే ఉన్న స్తంభాన్ని పట్టుకుని రాత్రంతా కదలకుండా నిల్చున్నాడు.
పాములు పట్టేవారు తెల్లవారు జామున వచ్చి అత్యంత చాకచక్యంగా యువకుని ప్యాంటు నుంచి సర్పాన్ని బయటకు తీయగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందు జాగ్రత్తగా అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: పబ్జీ.. ఇది ఆటా లేక యమ పాశమా?