హాథ్రస్ యువతి విషాదాంతం దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారనికి పాల్పడ్డాడు ఝార్ఖండ్‌కు చెందిన ఓ 60 ఏళ్ల కామాంధుడు. సుఖ్ దేవ్ నగర్‌కు చెందిన దేనానాథ్ శర్మ.. చిన్నారి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ప్రవేశించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మార్కెట్‌కి వెళ్లిన బాలిక తల్లిదండ్రులు తిరిగొచ్చాక విషయం బయటపడింది. తీవ్ర శారీరక క్షోభకు గురైన చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
మధ్యప్రదేశ్‌లో..
ఇక మధ్యప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఖర్గోన్ జిల్లాలో గుడిసెలో నివసిస్తోన్న బాలికను పొలంలోకి ఈడ్చుకెళ్లిన కామాంధులు తనతో ఉన్న సోదరుడిని కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారని స్థానిక ఎస్పీ శైలేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు.
బలరామ్‌పుర్‌లో..
బలరామ్‌పుర్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో తీవ్ర గాయాలైన యువతిని చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలోనే ఆమె తుది శ్వాస విడిచింది.
బులంద్‌షెహర్‌లో..
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మరోవైపు యూపీలోని బులంద్‌షెహర్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జియాన్‌పూర్‌లో..
యూపీలోని అజాంగర్ జిల్లా జియాన్‌పూర్ ప్రాంతంలో 8 ఏళ్ళ బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లిన నిందితుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుడ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భాగ్‌పత్ కోల్వాలిలో..
భాగ్‌పత్ కోల్వాలిలో 17 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, బ్లాక్ మెయిల్ చేసిన ఓ కామాంధుడి వేధింపులు తాళలేక.. ఆత్మహత్యకు యత్నించింది బాలిక. అయితే, నిందుతుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. బాలిక ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై గొంతు కోసి..