'ఏం చదివామన్నది కాదు.. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించామా లేదా అన్నదే ముఖ్యం' అంటున్నాడు తమిళనాడుకు చెందిన సయ్యద్ ముక్తార్ అహ్మద్. అందుకే మరి, ఏంబీఏ చేసిన తాను ఇప్పుడు గౌరవంగా మున్సిపాలిటీలో స్వీపర్ బ్యాధతలు నిర్వర్తిస్తున్నాడు.
జీవితాశయమే అది..
కోవై కునియాముతూర్కు చెందిన సయ్యద్.. ఎంబీఏ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం చేయడమే సయ్యద్ జీవితాశయం. అందుకోసం తాను రాయని పోటీపరీక్ష లేదు, చేయని ప్రయత్నమూ లేదు. కానీ, అన్నీ తృటిలో చేజారిపోయాయి. అయినా విసుగు చెందలేదు. ప్రభుత్వ శాఖల్లో ఏ నోటిఫికేషన్ విడుదలైనా.. అన్నింటికీ దరఖాస్తు చేశాడు. అదే క్రమంలో గతేడాది అక్టోబర్లో మున్సిపాలిటీ స్వీపర్ ఉద్యోగాల ప్రకటన చూసి ప్రయత్నించాడు.
సయ్యద్ నిరీక్షణ ఫలించింది. ఈ నెల 6వ తేదీన స్వీపర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు సయ్యద్. ఎంబీఏ చేసి రోడ్లు ఊడవడమేమిటని మొదట్లో ఒప్పుకోలేదు కుటుంబసభ్యులు. కానీ, పారిశుద్ధ్య పనంటే.. ఎంతో గౌరవప్రదమైందని, ప్రజల ఆరోగ్యాలు కాపాడే ఉన్నతమైన వృత్తి అని వారిని ఒప్పించాడు.
ఎంబీఏ చేసి స్వీపర్ ఉద్యోగం చేయడానికి సయ్యద్ ఏమాత్రం ఇబ్బంది పడలేదు. 'పీజీ చేశానన్న అహం మనలో ఉంటే.. ఏ ఉద్యోగంలోనూ సంతృప్తి పొందలేమ'ని చెబుతున్నాడు.
ఇదీ చదవండి:'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'