మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం 'పెళ్లి'. అందుకే అందరూ వివాహ శుభకార్యాన్ని ఘనంగా జరుపుకోవాలని చూస్తారు. కొందరైతే సమస్త బంధుమిత్రులను ఆహ్వానించి.. 5 రోజులు, 16 రోజులపాటు పెళ్లి వేడుక జరుపుకుంటారు. అయినవారందరి మధ్య కనువిందుగా పెళ్లి జరుగుతుంటే.. ఫంక్షన్ హాళ్లు కోలాహలంగా మారిపోతుంటాయి.
కానీ కరోనా మహమ్మారి కారణంగా.. పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించాల్సి వస్తోంది. బంధుమిత్రులందరినీ పెళ్లికి పిలవలేకపోతున్నాం. 5 రోజులు, 16 రోజుల పాటు పెళ్లి చేసుకునే అవకాశమే లేదు. ప్రస్తుతం అందరూ ఫంక్షన్ హాళ్ల సంస్కృతిని వీడి.. పూర్వం జరుపుకున్నట్లుగానే ఫామ్‌హౌస్, గార్డెన్స్, ఇంటి భవనంపై ఉండే ఖాళీ స్థలాల్లోనే వివాహం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పరిస్థితులకు తగ్గట్లుగానే వెడ్డింగ్ ప్లానర్లు సైతం వినూత్న ఆలోచనలతో తెరపైకి వస్తున్నారు. ఫలితంగా.. వైక్రో వెడ్డింగ్, ప్రత్యక్ష ప్రసారం, పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు దుస్తులకు మ్యాచ్ అయ్యేలా మాస్క్‌లు దర్శనమిస్తున్నాయి.
" ప్రస్తుతం మైక్రో వెడ్డింగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో వధూవరులకు అత్యంత ఆత్మీయులను మాత్రమే వివాహానికి ఆహ్వానిస్తాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వివాహానికి కేవలం 50 మందినే అనుమతిస్తున్నాం. పెళ్లికి ప్రత్యక్షంగా హాజరుకాలేని వారికి గిఫ్ట్ బాక్స్‌లతో కూడిన ఉత్తరాలను పంపిస్తున్నాం. ప్రభుత్వ నియమాల కారణంగా మిమ్మల్ని పెళ్లికి ఆహ్వానించలేకపోతున్నాం అని లేఖ ద్వారా తెలియజేస్తున్నాం. ఒకప్పుడూ అందరూ ఫంక్షన్ హాళ్లలో వివాహాలు చేసుకునే వారు, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అందరూ పురాతన పద్ధతుల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు."
- ఛౌరారియా, కలర్ ప్యాలెట్ క్రియేటివ్ హెడ్
పీపీఈ కిట్లు ధరించాల్సిందే..
వివాహ వేడుకలో భౌతిక దూరం పాటించేలా, కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించేలా వెడ్డింగ్ ప్లానింగ్ సిబ్బంది మొత్తం పీపీఈ కిట్లు ధరిస్తున్నారు.
" పెళ్లికి వచ్చే అతిథులకు మాస్క్, శానిటైజర్, గ్లౌజులు, టిష్యూలతో కూడిన చిన్న కిట్ అందిస్తాం. అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతిస్తాం. అలాగే పెద్దవారి కాళ్లకు మొక్కే సమయంలో వారిని ప్రత్యక్షంగా తాకకుండా ఉండేలా.. ఓ ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ షీల్డ్‌ను అందజేస్తున్నాం."
- ఛౌరారియా, కలర్ ప్యాలెట్ క్రియేటివ్ హెడ్
హెల్ప్‌డెస్క్ కూడా..
వివాహానికి వచ్చే వారికి మాస్కులు, శానిటైజర్‌తో పాటు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
" గతంలో ప్రపంచ వ్యాప్తంగా మేము చాలా పెళ్లిళ్లు చేశాం. కానీ ప్రస్తుతం చాలా తక్కువ వివాహాలు ఉన్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులకు సలహాలిచ్చేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాం. వివాహానికి వచ్చిన వారందరూ మాస్కులు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి."
- అభిలాష్, తరిణి వెడ్డింగ్స్