మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న సంజీవ్ చావ్లాను 12 రోజుల పోలీసు కస్టడీకి దిల్లీ కోర్టు ఆదేశాలిచ్చింది. 2000లో దేశాన్ని కుదిపేసిన క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో ప్రధాన బుకీగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు చావ్లా.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో సంజీవ్ చావ్లాను తిహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. చావ్లా కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు.
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ సారథి హన్సీ క్రోన్జేకు సంబంధం ఉన్న ఈ కేసులో బ్రిటీష్ జాతీయుడైన చావ్లాను దిల్లీ పోలీసులు ఇవాళ భారత్‌కు తీసుకొచ్చారు. ఇంగ్లాండ్ నుంచి దిల్లీకి వచ్చాక అదుపులోకి తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో..
2000 ఫిబ్రవరి-మార్చిలో భారత పర్యటనకు వచ్చింది దక్షిణాఫ్రికా జట్టు. ఆ సమయంలో జట్టు సారథి క్రోన్జే ఫిక్సింగ్‌కు పాల్పడేందుకు చేసిన కుట్రలో చావ్లా ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 1996లో చావ్లా లండన్‌కు వెళ్లినట్లు విచారణలో తెలిసింది.
2016లో అరెస్ట్..
చావ్లాను 2016 జూన్‌లో అరెస్ట్ చేశారు ఇంగ్లాండ్ పోలీసులు. అయితే.. తనను భారత్‌కు అప్పగించటాన్ని సవాలు చేస్తూ ఐరోపా మానవ హక్కుల కోర్టును ఆశ్రయించాడు చావ్లా. అయితే ఆయన పిటిషన్‌ను గత వారం కొట్టివేసింది కోర్టు. చావ్లాకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని భారత్ ఇచ్చిన హామీకి ఈ ఏడాది జనవరి 16న ఇద్దరు సభ్యుల కోర్టు ప్యానల్ అంగీకరించింది. ఆయన్ను భారత్‌కు పంపేందుకు అంగీకరించింది.