ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అంత సులభం కాదని అమెరికాకు చెందిన సాంకేతిక నిపుణుడు గెల్బ్ స్పష్టం చేశారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
అనుమానాలు అక్కర్లేదు...
భారత్‌లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని గెల్బ్ అన్నారు. ఓ వార్తా సంస్థ ముఖాముఖిలో పలు సందేహాలపై స్పష్టత ఇచ్చారు.
"భారత్‌లో ఈవీఎంలకు ఉపయోగించిన సాంకేతికత విశ్వసనీయమైనదని నా పరిశోధనల ద్వారా తెలిసింది. ప్రతి సాంకేతికతలో లోపాలుంటాయి. భారత్‌లో వినియోగించిన యంత్రాలు ఆఫ్‌లైన్‌లో పనిచేస్తాయి. వాటిని ట్యాంపరింగ్ చేయాలంటే భౌతికంగా విడగొట్టాల్సి ఉంటుంది. మాస్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం అసాధ్యం. విశ్వసనీయతకు మరో ప్రామాణికం వీవీప్యాట్ స్లిప్పులు. ఈవీఎం స్వతంత్రంగా పనిచేసే యంత్రం. ఇతర దేశాలు అనుసరిస్తున్న ఇంటర్నెట్ ఓటింగ్ విధానానికి ఇది పూర్తిగా భిన్నం."
-గెల్బ్, ఈవీఎం నిపుణుడు.
పాకిస్థాన్, పలు ఆఫ్రికా దేశాల్లోని ఈవీఎంలపై ఎన్నో పరిశోధనలు నిర్వహించారు గెల్బ్.
ఇదీ చూడండి: మోదీకి దేశాధినేతల శుభాకాంక్షల వెల్లువ