భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భాజపా నేత మదన్ లాల్ సైనీ మృతితో ఖాళీ అయిన స్థానంలో ఉపఎన్నిక జరిగింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముగియగా మన్మోహన్ మినహా ఎవరూ నామపత్రాలు సమర్పించలేదు.
భాజపా దూరం
ఫలితంగా మన్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రమిల్ కుమార్ మథుర్ ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి మన్మోహన్ సింగ్ నామినేషన్ సమర్పించగా భాజపా ఈ ఎన్నికకు దూరంగా ఉంది.
రాష్ట్రానికే గర్వకారణం
రాజస్థాన్ నుంచి ఎన్నికైన మన్మోహన్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎన్నిక రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. మన్మోహన్‌కున్న అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడు దశాబ్దాలుగా అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన మన్మోహన్ అక్కడ కాంగ్రెస్‌కు బలం లేకపోవడం వల్ల ఇప్పుడు రాజస్థాన్ నుంచి బరిలోకి దిగారు. 10 రాజ్యసభ స్థానాలున్న రాజస్థాన్‌లో భాజపా తొమ్మిది స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తోంది. మన్మోహన్ ఎన్నికతో కాంగ్రెస్‌కు ఒక స్థానం లభించింది.
ఇదీ చూడండి: 'రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని విడనాడాలి'