సాధించాలనే తపన ఉండాలే కానీ కల నెరవేర్చుకోడానికి ఏదీ అడ్డుకాదని నిరూపించాడు కేరళకు చెందిన ఓ వ్యక్తి. పోస్ట్‌మ్యాన్‌గా స్థిరపడి.. ఇప్పుడు నటుడిగా రాణిస్తున్నాడు.
కొల్లాం జిల్లాలోని చందనతోపే తపాలా కార్యాలయంలో.. దాదాపు 20 ఏళ్లుగా పోస్ట్‌మ్యాన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు మణికందన్. మణికి బాల్యం నుంచే నటనపై మక్కువ ఎక్కువ. ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్‌కు వీరాభిమాని మణికందన్. తానూ ఏదో ఒక రోజు వెండితెరపై కనిపించాలని కలలుగన్నాడు. అవకాశం కోసం కాళ్లరిగేలా తిరిగాడు. చిన్న చిన్న కథలు రాశాడు. కానీ ఛాన్స్ రాలేదు. దీంతో కుటుంబ పోషణ కోసం పోస్ట్‌మ్యాన్‌గా స్థిరపడ్డాడు.
అవసరానికి ఉత్తరాలు పంచే అవతారమెత్తాడే గానీ, మణికందన్‌కు నటనపై ప్రేమ మాత్రం తగ్గలేదు. వీలు కుదిరినప్పుడల్లా ఆడిషన్స్‌కు వెళ్లేవాడు. ఆ దృఢ సంకల్పమే.. మణికి అవకాశం తెచ్చిపెట్టింది. ప్రముఖ సినీ దర్శకురాలు విధూ వీసెంట్ సినిమాలో ఓ పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. 'కార్ట్ బ్లాంచీ' పేరిట ఆర్యక్రిష్ణన్ దర్శకత్వంలో విడుదలైన మూకీ లఘు చిత్రంలో... మణికందన్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి.
అలుపెరగని ప్రయత్నంతో మణికందన్ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఇప్పుడు ఓ వైపు పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం చేస్తూనే మరో వైపు తనకు నచ్చిన రంగంలో రాణిస్తున్నాడు మణి. రోజూ తమ గ్రామాల్లో ఉత్తరాలు పంచే పోస్ట్మ్యాన్లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడని ఊహించలేదంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు.
ఇదీ చదవండి: యాప్‌లో కూరగాయలు అమ్మేస్తున్న గిరిజన 'రైతమ్మలు'!