కర్ణాటక బెంగళూరు హొసకెరెహళ్లి ప్రాంతంలో పూర్తిగా నీటమునిగిన ఇంటినుంచి 15రోజుల పసికందుని ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ యువకుడు. శిశువు ఆర్తనాదాలు విన్న యువకుడు చలించిపోయాడు. వరద ప్రవాహంలో చంటి బిడ్డను జాగ్రత్తగా నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లి తల్లికి అప్పగించాడు. అదే రోజు మరొక చోట ఒక బాలికను సైతం కాపాడి చంటి పిల్లల పాలిట ఆపద్బాంధవుడు అయ్యాడా యువకుడు.
వర్ష బీభత్సం :
బెంగళూరును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదకు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి.హొసకెరెహళ్లి ప్రాంతం నదిని తలపిస్తోంది. అక్కడి దత్తాత్రేయ స్వామి దేవాలయం పూర్తిగా నీట మునిగింది. వరద ప్రవాహానికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని అనేక భవనాలు, దేవాలయాలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
కర్ణాటక మంత్రి ఆర్ అశోక్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ధైర్యం చెప్పారు. జాతీయ విపత్తు నిర్వాహక బృందం 20 పడవలను రంగంలోకి దింపింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది.