హరియాణాలో ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భర్త క్రూరత్వానికి దాదాపు ఏడాదిన్నర కాలంగా.. టాయిలెట్లోనే మగ్గిపోయిన ఓ మహిళ ఉదంతం బయటపడింది.
అసలేం జరిగింది?
హరియాణాలోని పానిపత్లో ఓ మహిళను.. ఇంటి మేడ మీద ఉండే చిన్న శౌచాలయానికే పరిమితం చేశాడు ఆమె భర్త. తరచూ ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. సరైన తిండి పెట్టకుండా వేధించేవాడు. పదిహేను లేదా ఇరవై రోజులకొకసారి ఆమెను బయటకు తీసుకొచ్చి.. మళ్లీ ఆ టాయిలెట్లోనే బంధించేవాడు. అలా ఏకంగా వందల రోజుల పాటు నరకం చూపించాడు. చివరకు స్థానికుల ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. భర్త నరకం నుంచి ఆమెకు విముక్తి కల్పించారు.
" టాయిలెట్లో ఓ మహిళ ఏడాదిన్నరగా బందీ అయి ఉందన్న సమాచారం అందింది. మేము ఆ ఇంటికి వచ్చి పరిశీలిస్తే మాకు వచ్చిన సమాచారం నిజమని నిర్ధరణ అయింది. ఆమె చాలా బలహీనంగా ఉంది. మమ్మల్ని చూడగానే అన్నం కావాలని అడిగింది."
-- రజనీ గుప్తా, మహిళా సంక్షేమాధికారి.
అబద్ధంతో కప్పిపుచ్చే ప్రయత్నం..
" మేము ఆ మహిళ ఇంటికి వెళ్లినప్పుడు ఆమె భర్త అక్కడే ఉన్నాడు. తన భార్య గురించి ప్రశ్నించగా ఆమె ఆరోగ్యం బాగోలేదని అన్నాడు. ఎంతోమంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడం వల్ల ఆమెను అక్కడ ఉంచామని చెప్పాడు. కానీ, ఆ ఇంటిచుట్టుపక్కల వారిని అడగ్గా.. అసలు విషయం బయటపడింది. అతను అబద్ధం చెబుతున్నాడని స్థానికులు చెప్పారు. ఆమెను సరిగ్గా చూసుకోకుండా, రోజూ కొడుతూ వేధిస్తున్నాడని వారు తెలిపారు. "
-- రజనీ గుప్తా, మహిళా సంక్షేమాధికారి.
ఇన్ని రోజులు నరకయాతన అనుభవించిన మహిళకు.. 15, 13, 11 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు సంతానం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కానీ, వాళ్లు కూడా తమ తల్లికి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోలేకపోయారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన అనంతరం భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇదీ చూడండి:భారీ వర్షాలకు గోడ కూలి ఆరుగురు మృతి