ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని తెలిపిన కొన్ని గంటలకే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మనసు మార్చుకున్నారు. గురువారం జరగనున్న ప్రమాణ స్వీకరానికి హాజరుకావట్లేదని తెలిపారు. బంగాల్లో 54 మంది భాజపా కార్యకర్తలు రాజకీయ ఘర్షణల్లో మరణించారని కమలనాథులు తప్పుడు ప్రచారం చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్వీట్ చేశారు.
"శుభాకాంక్షలు ప్రధాని మోదీజీ. ఆహ్వానాన్ని అంగీకరించి ప్రమాణ స్వీకారానికి హజరవుదామనే అనుకున్నా. కానీ బంగాల్లో గత ఏడాది కాలంలో రాజకీయ హింస వల్ల 54 మంది మరణించారని భాజపా చెబుతోందన్న వార్తలను మీడియాలో చూస్తున్నా. భాజపా ప్రచారాల్లో నిజం లేదు. బంగాల్లో రాజకీయ హత్యలు జరగలేదు. వ్యక్తిగత గొడవలు, కుటుంబ కలహాలు, ఇతర వివాదాల వల్ల మరణాలు జరిగి ఉండొచ్చు. వీటితో రాజకీయాలకు సంబంధం లేదు. ప్రజాస్వామ్య విజయాన్ని జరుపుకోవడానికి ప్రమాణ స్వీకారం అనేది ఒక ప్రతిష్టాత్మకమైన వేదిక. అందులో రాజకీయ లబ్ధిపొందాలని అనుకోకూడదు."
--- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
సార్వత్రిక ఎన్నికల్లో దీదీ- మోదీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
ఇదీ చూడండి: 'ధోనీని ద్వేషించే వారు వేరే గ్రహానికి వెళ్లిపొండి'