నేతాజీ జయంతి వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించాల్సిన సమయంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఒకవైపు ప్రధాని మోదీ వేదికపై ఉండగా.. మరో వైపు సీఎం మమత మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కొందరు 'జై శ్రీరామ్' నినాదాలు చేశారు. దీంతో దీదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
"ప్రభుత్వ కార్యక్రమానికి కొంత గౌరవం ఉండాలి. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ఇంతకు మించి నేను ఏమీ మాట్లాడను. జై భారత్, జై బంగాల్." అని తన ప్రసంగాన్ని ముగించారు మమత బెనర్జీ.
ఒకే వేదికపై మోదీ.. దీదీ..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం బంగాల్లో పర్యటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన నేడు కోల్‌కతా వచ్చారు. ఉత్సవాల వేదికైన విక్టోరియా మెమోరియల్‌కు మోదీ చేరుకున్నారు. వేడుకలు ప్రారంభమవడానికి ముందు విక్టోరియా మోమోరియల్‌ను సందర్శించారు. ప్రధాని వెంట బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఉన్నారు. రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకునే మోదీ, దీదీ.. నేతాజీ ఉత్సవాల కోసం ఒకే వేదికపై కన్పించడం విశేషం.
నేతాజీ పూర్వీకుల ఇంటికి..
శనివారం మధ్యాహ్నం కోల్‌కతా చేరుకున్న మోదీ నేరుగా బోస్ పూర్వీకుల ఇంటికి వెళ్లారు. భవానీపూర్‌లోని నేతాజీ భవన్ చేరుకున్న మోదీని.. బోస్ మనవళ్లు సుగతో, సుమంత్రో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటం వద్ద నివాళులర్పించిన ప్రధాని.. ఆయన ఉపయోగించిన కారు, మంచం, టేబుల్ తదితర వస్తువులను ఆసక్తిగా తిలకించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత జాతీయ లైబ్రరీని సందర్శించారు. అక్కడి నుంచి విక్టోరియా మెమోరియల్‌కు చేరుకున్నారు.
ఇదీ చూడండి: 'నేతాజీ సారథ్యంలో కొత్త పంథాలో స్వాతంత్య్రోద్యమం'