శబరిమలలో ఇవాళ సాయంత్రం జరగాల్సిన మకర జ్యోతి దర్శనానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భక్తులు ఎంతో ప్రత్యేకంగా భావించే ఈ ఉత్సవం కోసం భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఆలయ నిర్వాహక బోర్డు(టీటీబీ) తెలిపింది.
ఏటా మకరజ్యోతి(మకరవిళక్కు) దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తారు. మకర సంక్రాంతి నాడు శబరిమలలో దర్శనమిచ్చే ఈ జ్యోతిని కనులారా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి తరలివస్తారు.
ఎప్పటిలాగానే ఈ సారి..
పొన్నంబలమేడులో అయ్యప్ప స్వామి బాల్యంలో నడయాడిన పందలం రాజభవనంలో భద్రపరచిన తిరువాభరణాలను ఆలయ ఈఓ సంస్కృతి ప్రాంతానికి తీసుకొస్తారు. వాటిని స్వామికి అలంకరిస్తారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యాక సంధ్యా సమయంలో మకర జ్యోతిని దర్శిస్తారు భక్తులు.
టీటీబీ, అటవీ శాఖల సహకారంతో పొన్నంబలమేడు వద్ద గిరిజనుల సంస్కృతిని కొనసాగిస్తూ.. జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు చేసింది కేరళ ప్రభుత్వం. వీలైనన్ని ఎక్కువ చోట్ల నుంచి భక్తులకు జ్యోతి కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంది.
భారీ భద్రత..
లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవంలో ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఇతర భద్రత బలగాలను మోహరించినట్లు టీటీబీ తెలిపింది.
జనవరి 21న ఆలయ ద్వారాలు మూతపడి, దర్శనాలు నిలిచిపోతాయి. ఆలోగా స్వామిని దర్శించుకునేందుకు దీక్షాధారులు శబరిమలకు పోటెత్తుతున్నారు. జ్యోతి దర్శన నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువైంది.
ఇదీ చూడండి: గుజరాత్లో గాలిపటాలు ఎగురవేసిన అమిత్ షా