అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్రలో అధికారం చేపట్టింది కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన పార్టీల కూటమి 'మహా వికాస్ అఘాడీ'. నెల రోజుల అనంతరం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. మొత్తం 36 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జాబితా ఇప్పటికే నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో అజిత్ పవార్, నవాబ్ మాలిక్, ధనంజయ్ ముండే, అదితి తట్కరే, రాజేశ్ టోపే ఉన్నట్లు సమాచారం.
డిప్యూటీగా.. అజిత్ పవార్!
ప్రమాణ స్వీకారం సమయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. కానీ.. అలా జరగలేదు. కాంగ్రెస్‌కు స్పీకర్, ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఒప్పందం నేపథ్యంలో ఆ పదవిని అజిత్ పవార్ చేపడతారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి..
మంత్రివర్గ విస్తరణలో భాగంగా కేటాయించే శాఖలపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ప్రజలతో నేరుగా సంబంధాలు లేని శాఖలను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారని హైకమాండ్‌కు ఏకరువు పెట్టుకున్నారు. పశు సంవర్ధక, జౌళి శాఖలను కేటాయింటే అవకాశం ఉందని.. వాటిని వ్యవసాయ, పరిశ్రమల శాఖల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు, సహాయ మంత్రుల పదవుల పంపకాల్లో సమతుల్యత లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
ఒప్పందం ప్రకారం..
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అధికారం చేపట్టే క్రమంలోనే పదవుల పంపకాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే శివసేనకు కేబినెట్‌లో 16 బెర్తులు, ఎన్సీపీకి 15, కాంగ్రెస్‌కు స్పీకర్ సహా 13 మంత్రి పదవులు దక్కనున్నాయి. కాంగ్రెస్‌కు దక్కే 13 బెర్తుల్లో 9 కేబినెట్, 4 సహాయ మంత్రి పదవులు ఉన్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రేతో పాటు 3 పార్టీలకు చెందిన ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో శివసేన నుంచి ఏక్నాథ్ శిందే, సుభాష్ దేశాయి.. ఎన్సీపీ నుంచి ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్.. కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థోరట్, నితిన్ రౌత్ ఉన్నారు.
ఇదీ చూడండి: ప్రియాంక కూర్చొన్న స్కూటీ ఓనర్‌కు రూ.6300 ఫైన్!