వరద విలయం నుంచి మహారాష్ట్ర ఇంకా తేరుకోలేదు. వరద నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నా సంగ్లీ, కొల్హాపుర్ జిల్లాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద నీరు పూర్తిగా వెళ్లేందుకు మరో 2,3 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
5 జిల్లాల్లో.. 29 మంది మృతి
కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈ రెండు జిల్లాలలో పాటు సతారా, పుణె, సోలాపూర్‌లోని అనేక ప్రాంతాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఈ జిల్లాల్లో ఇప్పటివరకు 29 మంది మృత్యువాత పడ్డారు.
నాసిక్‌లో వరద ఉద్ధృతికి 758 గ్రామాల్లో 21 వేల హెక్టార్ల పంట నీట మునిగింది. 32 వేల మంది రైతులపై ప్రభావం పడింది.
లోతట్టు ప్రాంతాల నుంచి 2లక్షల 85 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
సహాయక చర్యలు ముమ్మరం
సంగ్లీలో 28, కొల్హాపుర్‌లో 18 గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంది.
ఈ జిల్లాల్లోని వరద బాధితులను సైన్యం, NDRF సురక్షిత ప్రాంతాలకు చేర్చుతోంది. బాధితులకు హెలికాప్టర్లు, పడవలు ద్వారా ఆహార పొట్లాలు, ఇతర వస్తువులు అందిస్తున్నారు.
సంగ్లీ పరిస్థితిపై సీఎం ఫడణవీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా పునరావాస ఏర్పాట్లు చూడాలని అధికారులను ఆదేశించారు.
షిరిడీ ట్రస్ట్ సాయం
మహారాష్ట్రలో వరద బాధితుల సహాయార్థం రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది షిరిడీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్. ఈ డబ్బును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని ఎస్ఎస్టీ ఛైర్మన్ సురేశ్ హవాడే తెలిపారు.
ఇదీ చూడండి: ఆచారం కోసం మృతదేహంతో వరదలో సాహసం