మహారాష్ట్రలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధికార కూటమి సాధారణ మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. భాజపా క్రితం సాధించిన సీట్ల కంటే కాస్త వెనుకంజలోనే ఉన్నప్పటికీ తొలి స్థానంలోనే ఉంది. 2014 ఎన్నికల్లో 63 స్థానాలు నెగ్గిన శివసేన ఈ సారి ఆ సంఖ్యను పెంచుకునేలా కనిపిస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తప్పని రుజువు చేసేలా ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ సర్వే సంస్థల అంచనాలకు మించి రాణిస్తున్నాయి. కాంగ్రెస్ కంటే ఎన్సీపీ కాస్త పైనే ఉండటం విశేషం.
వ్యూహాత్మకంగా సేన...
భాజపా-శివసేన కూటమి కలిసే మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే... ఈ నేపథ్యంలో శివసేన కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలనే ప్రతిపాదన భాజపా ముందు పెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది.
ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖులు ముందంజలో ఉన్నారు. భాజపా సీఎం అభ్యర్థి ఫడణవీస్, ఎన్సీపీ నేత అశోక్ చవాన్, శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఇంకా పలువురు ముఖ్యులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 122, శివసేన 63 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 చోట్ల నెగ్గాయి. భాజపా-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.