భాజపా-శివసేన.. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందే పొత్తుతో బరిలోకి దిగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించాయి. హంగ్ ఏర్పడిన హరియాణాలో సర్కారు కొలువుదీరినా.. స్పష్టమైన మెజారిటీ వచ్చిన మహారాష్ట్రలో మాత్రం ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి పురోగతి లేదు.
10 రోజులు గడిచిపోయాయి.. ఈ నెల 9వ తేదీతో ప్రస్తుత శాసనసభ గడువూ పూర్తవనుంది. ఈ తరుణంలో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజపా తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. పార్టీ కీలక నేతలతో నేడు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం విలేకర్లతో మాట్లాడిన సీనియర్ నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే శుభవార్త వింటారని ప్రకటించారు.
"ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ క్షణంలోనైనా శుభవార్త వింటారు. భాజపా శాసనసభాపక్ష నేత ఫడణవీస్‌కు మా పూర్తి మద్దతును తెలిపాం. భాజపా-శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. శివసేన ఇప్పటివరకు మాకు ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. వారి కోసం భాజపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఫడణవీస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు." - భాజపా నేతలు
వెనక్కి తగ్గని సేన...
ఫలితాలు వెలువడిన నాటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి కీలక వాఖ్యలు చేశారు. భాజపా నేతల ప్రకటనలపై స్పందించారు.
"భాజపా నేతలు ఏం చెప్పారో నేను వినలేదు. వారు ముఖ్యమంత్రి పీఠం పంచుకోవడంపై ఏమైనా మాట్లాడి ఉంటే నిజంగా వారు అర్థం చేసుకున్నట్లే. అయితే ఆ విషయంపై భాజపా నుంచి మాకు రాతపూర్వకమైన హామీ కావాలి." - సంజయ్ రౌత్, శివసేన ఎంపీ
భాజపాకు రాంరాం చెప్తేనే...
భాజపా-శివసేన వివాదంపై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ... భాజపా-సేన మధ్య సయోధ్య కుదరకపోతే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తామని తెలిపింది.
"శివసేనకు భాజపా ముఖ్యమంత్రి పీఠం ఇస్తే ఏ సమస్యా లేదు. భాజపా తిరస్కరిస్తే... ప్రత్యామ్నాయం ఉంది. అయితే అందుకోసం శివసేన ఓ ప్రకటన చేయాలి. భాజపాతో తమకు ఇంకా ఎలాంటి సంబంధాలు లేవని చెప్తే...అప్పుడు ప్రత్యామ్నాయం ఉంటుంది." - నవాబ్ మాలిక్, ఎన్సీపీ అధికార ప్రతినిధి
గడ్కరీకి 2 గంటలు చాలు...
శివనేన సీనియర్ నేత కిషోర్ తివారీ.. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌కు ఓ లేఖ రాశారు. భాజపా-శివసేన మధ్య పరిస్థితి సద్దుమణగాలంటే గడ్కరీని చర్చలకు పంపాలని కోరారు. గడ్కరీ అయితే ఈ సమస్యకు రెండు గంటల్లోనే పరిష్కారం చెబుతారని అభిప్రాయపడ్డారు.
- ఇదీ చూడండి: 'మహా రాజకీయాల్లో మార్పు.. ప్రభుత్వం శివసేనదే'