భారత్- చైనా సరిహద్దు అంశమై ఇరు దేశాల సైనిక కమాండర్లు బుధవారం మరోసారి భేటీ కానున్నారు. పూర్తిస్థాయి బలగాల ఉపసంహరణపై ఈ సమావేశం వేదికగా చర్చ జరగనుందని తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో శాంతి నెలకొల్పే దిశగా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇరు దేశాల కమాండర్ల స్థాయిలో ఈ నాలుగో దఫా చర్చలు ముగిసిన అనంతరమే పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ లోయ నుంచి బలగాలను వెనక్కి తరలించింది చైనా. అయితే పాంగాంగ్ సరస్సులోని నాలుగో ఫింగర్ నుంచి ఎనిమిదో ఫింగర్ వరకు చైనా ఆక్రమణలను వెనక్కి తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమయినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంది భారత్. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. సైన్యానికి చెందిన అగ్రస్థాయి కమాండర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
జులై 5న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ మధ్య రెండు గంటలపాటు చర్చ జరిగింది. అనంతరం జులై 6న బలగాలను వెనక్కి తరలించే ప్రక్రియ ప్రారంభమయింది. అనంతరం శుక్రవారం రోజు ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన చర్చ జరిగింది. ఈ సమావేశం వేదికగానే బలగాలను పూర్తిస్థాయిలో వెనక్కి తరలించే అంశమై తుది నిర్ణయం తీసుకోవాలని ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: 'భారత భూభాగమంతా భద్రతా దళాల అధీనంలోనే'