ఏడుగురు కాంగ్రెస్ సభ్యులపై విధించిన సస్పెన్షన్ను లోక్సభ ఎత్తివేసింది. ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. సస్పెన్షన్ ఎత్తివేత తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు సభాపతి ఓం బిర్లా.
దిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుపడుతూ సభలో ఆందోళన చేసిన కారణంగా ఏడుగురు ఎంపీలను ఈనెల 5న సస్పెండ్ చేశారు స్పీకర్. సభలో చర్చకు సంబంధించిన కొన్ని కాగితాలను అధికార పక్ష సభ్యుల నుంచి లాక్కుని.. వాటిని చింపి వేయడాన్ని అమర్యాద ప్రవర్తనగా అభివర్ణించారు ప్యానెల్ స్పీకర్ మీనాక్షి లేఖి.
ఫలితంగా కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యులు గౌరవ్ గొగోయ్, టీ ఎన్ ప్రతాపన్, డీన్ కురియాకోస్, ఆర్.ఉన్నిత్తన్, మణికమ్ ఠాగోర్, బెన్నీ బెహ్నన్, గుర్‌మీత్ సింగ్ ఔజ్‌లాలపై చర్యలు తీసుకున్నారు.