రాష్ట్ర శాసనసభల్లో సుదీర్ఘ సమావేశాలు నిర్వహించాలని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా సూచించారు. ఈ సమావేశాల్లో శాసనసభ్యులు ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తాలని కోరారు. అది ప్రభుత్వం మరింత జవాబుదారీగా పనిచేయడానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
రాజస్థాన్ అసెంబ్లీలో శాసనసభ నియమాలు, అందులో అనుసరించాల్సిన పద్ధతుల గురించి... ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా పాల్గొన్నారు. శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా... దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చల్లో పాల్గొనాలని సూచించారు.
అలా చేస్తే నాయకుడు కాలేరు..
శాసనసభలో ఓ మంత్రిత్వశాఖకు సంబంధించిన ప్రశ్నలు అధికంగా ఉంటే... సంబంధిత మంత్రి తన విభాగాన్ని సమీక్షించుకోవడానికి మరింత ఎక్కువ అవకాశం లభిస్తుందని ఓమ్ బిర్లా అన్నారు. అందుకే శాసనసభ సమావేశాలు సుదీర్ఘంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
శాసనసభ్యులు హౌస్ వెల్‌లోకి వచ్చి నిరసనలు చేపట్టడం మంచి సంప్రదాయం కాదని ఓమ్ బిర్లా అన్నారు. అలా చేయడం వల్ల సాధారణంగా సభ వాయిదాలు పడుతుందని... ఇది మంచి పద్ధతికాదని అభిప్రాయపడ్డారు.
"హౌస్ వెల్‌లోకి ప్రవేశించడం ద్వారా నాయకుడు కాలేరు. కాలం మారిందని లోక్‌సభలో నేను చెప్పాను. శాసనసభల్లో సమస్యలపై మాట్లాడే సభ్యులనే.... ఇప్పుడు ప్రజలు ఇష్టపడుతున్నారు."- ఓమ్ బిర్లా, లోక్‌సభ స్పీకర్
ఆదర్శంగా ఉండాలి...
లోక్‌సభ సజావుగా జరిగితే... దానిని రాష్ట్రాల అసెంబ్లీలూ ఆదర్శంగా తీసుకుని అనుసరిస్తాయని ఓమ్‌బిర్లా అభిప్రాయపడ్డారు. శాసనసభ్యులు సభ సంప్రదాయాలకు అనుగుణంగా వాస్తవాల ఆధారంగా సమస్యలపై మాట్లాడాలని స్పీకర్ కోరారు.
ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా... రాజస్థాన్ అసెంబ్లీ నూతన వెబ్సైట్, మొబైల్ యాప్‌నూ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ సీ.పీ జోషి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కఠారియా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'పరిస్థితులు అనుకూలిస్తే ప్రభుత్వ ఏర్పాటు'