రాకాసి మిడతల కారణంగా రైతులకు పంట నష్టం జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్టు కేంద్రం వెల్లడించింది. మిడతల దండును నియంత్రించేందుకు రసాయనాలు పిచికారీ చేసినట్లు పేర్కొంది. ఏప్రిల్ 11 నుంచి జులై 9 వరకు 1.51 లక్షల హెక్టార్లలో మిడతలను నాశనం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదేశాల మేరకు మిడతలను నియంత్రించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణాలో మిడతల నియంత్రణ కార్యాలయాలు(ఎల్సీఓ) లక్షా 51వేల 269 హెక్టార్లలో పంటనష్టం జరగకుండా చర్యలు చేపట్టాయని ప్రకటన పేర్కొంది.
అలాగే మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలు లక్షా 32వేల 660 హెక్టార్లలో మిడతలను నాశనం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది.
ప్రస్తుతం 60 బృందాలు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో రసాయనాలు వెదజల్లేందుకు స్ప్రే వాహనాలతో సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 200మందికిపైగా కేంద్ర సిబ్బంది.. మిడతలను కట్టడి చేసేందుకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదనంగా మరో 20 స్ప్రే పరికరాలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
" రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో మిడతల దండును నియత్రించేందుకు 5 కంపెనీలు 15 డ్రోన్లతో సిద్ధంగా ఉన్నాయి. ఎంఐ-17 హెలికాప్టర్ ద్వారా మిడతలను నాశనం చేసేందుకు భారత వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ మంచి ఫలితాలిచ్చింది. రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాల్లో మినహా మిగతా రాష్ట్రాల్లో అధిక పంటనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దు నుంచి రాజస్థాన్‌కు కీటకాలు వచ్చే అవకాశాలున్నాయి. "
-కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటన.
ఇదీ చూడండి:యూపీలో 'అగ్రవర్ణ' రాజకీయం కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?