కరోనా కట్టడి కోసం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అనాలోచితంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారని మరోమారు కేంద్రంపై విమర్శలు చేసింది కాంగ్రెస్. లాక్డౌన్ ఎత్తివేసేందుకూ ప్రభుత్వం వద్ద ఎలాంటి సరైన వ్యూహం లేదని ఎద్దేవా చేసింది.
కేంద్ర ప్రభుత్వం అసమర్థత, అలసత్వానికి ప్రతిరూపమని విమర్శించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ.
" కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్డౌన్ సరైన నిర్ణయం. దానికి మా మద్దతు ఉంటుంది. కానీ... లాక్డౌన్ విధించటం, ఎత్తివేయటంలో ప్రభుత్వానికి సరైన వ్యూహం లేదు. ప్రణాళిక లేని లాక్డౌన్తో ఎంత ప్రయోజనం చేకూరింది? ఈ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందా? దేశంలో కరోనా పరిస్థితులను అంచనా వేయడానికి కేసులు, మరణాలు, పరీక్షలు చాలా ముఖ్యమైన పారామితులు. వీటి విషయంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. లాక్డౌన్తో మే 10 వరకు 383 మంది ప్రాణాలు కోల్పోయారు."
– అభిషేక్ మను సింఘ్వీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
దేశంలో నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు సింఘ్వీ. సీఎంఐఈ అధ్యయనం ప్రకారం భారత్లో మే 3 వరకు నిరుద్యోగ రేటు 27.1 శాతానికి చేరుకున్నట్లు తెలిపారు. అమెరికాతో పోలిస్తే నాలుగు రెట్లు అధికమన్నారు. దేశవ్యాప్తంగా 122 మిలియన్ల మంది ఉపాధి కోల్పోయారని.. అందులో 91 మిలియన్లు చిన్న వ్యాపారులు, కార్మికులు, 18 మిలియన్ల మంది వేతనజీవులని పేర్కొన్నారు.