జమ్ము కశ్మీర్, కేరళలో ఈద్-ఉల్ ఫితర్ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ముస్లింలు తమ ఇళ్లలోనే, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా మసీదుల్లో సామూహిక ప్రార్థనలకు అవకాశం లేకుండా పోయింది.
జమ్ము కశ్మీర్, కేరళలో ఆదివారం ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటుండగా... మిగతా రాష్ట్రాల్లో సోమవారం జరుపుకోనున్నారు. ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షకు ఈద్ వేడుకతో ముగింపు పలుకుతారు.
ఇది రెండోసారి..
జమ్ము కశ్మీర్లో సామూహిక ఈద్ ప్రార్థనలు జరగకపోవడం ఇది రెండోసారి. ఆర్టికల్ 370 రద్దు సమయంలో పోలీసులు కర్ఫ్యూ విధించడం వల్ల.. మొదటిసారి వేడుకలు జరగలేదు. ప్రస్తుతం కరోనా నివారణ కోసం లాక్డౌన్ కొనసాగుతుండడం వల్ల వీలుపడలేదు.
నిబంధనలు ఉల్లంఘించి..
లాక్డౌన్ ఆంక్షలు ఉన్నందున మసీదుల్లో సామూహిక ఈద్ ప్రార్థనలు జరపకూడదని పోలీసులు ప్రసార మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పట్టణాలు, నగరాల్లోని కొన్ని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: వలస విషాదం: 100కి.మీ నడిచి ప్రసవం- బిడ్డ మృతి