దేశంలో లాక్డౌన్ వల్ల నిత్యావసరాలు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందినవాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే.. ఈ సమస్య పరిష్కారానికి కర్ణాటక మైసూర్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఓ మంచి ఆలోచన చేశారు.
వస్తువుల కొరతను అధిగమించేందుకు వస్తు మార్పిడి విధానం అవలంబిస్తున్నారు. పరస్పర అంగీకారంతో నిత్యావసరాలు పంచుకుంటూ సహకరించుకుంటున్నారు.
నీకు గోధుమలు.. నాకు బియ్యం...
ఉదాహరణకు ఒకరు బియ్యం ఇస్తే.. బదులుగా గోధుమలు, గోధుమలిస్తే బియ్యం ఇవ్వడం వంటివి చేస్తున్నారు. పండ్లు, కూరగాయలు, ఇతరత్ర సామగ్రి ఏదైనా ఇదే పద్ధతిని పాటిస్తూ కొరత లేకుండా చూసుకుంటున్నారు. మందకళ్లి, కెంచలగుడు, నాగనహళ్లి గ్రామాల్లో ఈ పద్ధతినే పాటిస్తున్నారు.
డబ్బు వాడుకలో లేక ముందు ఈ తరహా విధానం ఉంది. శతాబ్దాల క్రితం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఇలా ఇచ్చిపుచ్చుకోవడం సాధారణమే అయినప్పటికీ ప్రస్తుత కష్టకాలంలో ఒకరినొకరు సహకరించుకోవడం ప్రశంసనీయమని చెప్పుకుంటున్నారు.