విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించినట్లు ఇస్రో ఆదివారం ప్రకటించింది. ల్యాండర్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఆర్బిటర్ పనితీరుపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ల్యాండర్ గురించి సమాచారం అందించి.. ఆర్బిటర్ తన పనితీరుపై ఉన్న అనుమానాలను తొలగించిందని అంతరిక్ష పరిశోధన నిపుణుడు అజయ్ లేలే ఉద్ఘాటించారు. ఇక మిగిలింది ల్యాండర్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడమేనని అభిప్రాయపడ్డారు. 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్డడీస్ అండ్ అనాలసిస్'లో సీనియర్ నిపుణుడిగా ఉన్నారు అజయ్ లేలే.
"ల్యాండర్ ఆచూకీతో ఆర్బిటర్పై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. చంద్రయాన్-2లో ఆర్బిటర్ ఒక ప్రధాన భాగం. ఇది ఏడాది కన్నా ఎక్కువ కాలం పని చేస్తుంది." -అజయ్ లేలే, అంతరిక్ష పరిశోధన నిపుణుడు
ఆర్బిటర్ ఎలాంటి ఆటంకం లేకుండా పని చేస్తుందంటే.. చంద్రయాన్-2 లక్ష్యం 90-95 శాతం పూర్తయినట్లేనని అజయ్ అభిప్రాయపడ్డారు.
ఇస్రో మాజీ ఛైర్మన్ స్పందన..
చంద్రయాన్-2పై ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్. నంబి నారాయణన్ స్పందించారు. ల్యాండర్ ఆచూకీ తెలియడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతమున్న సవాలు విక్రమ్‌తో సంకేతాలు పునరుద్ధరించడమేనని అన్నారు. అనుకున్నట్లుగా విక్రమ్ మృదువుగా దిగలేకపోతే.. సంకేతాల పునరుద్ధరణ అవకాశాలు తక్కువేనని అభిప్రాయాపడ్డారు.
ఇదీ చూడండి: దేశంలో క్రీడాస్ఫూర్తి తరహాలో ఇస్రో-స్ఫూర్తి: మోదీ