భాజపా సీనియర్ నేత, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ వంటి పథకాలు ప్రకటించడం వల్ల కష్టపడే రైతలు బద్దకస్తులుగా తయారవుతారని అన్నారు. పీటీఐ వార్తా సంస్థ ముఖాముఖిలో పలు విషయాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఖట్టర్.
రుణమాఫీ ప్రభావం ఉండదు
రైతులకు రుణమాఫీ ప్రకటించకపోడం భాజపాపై లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు ఖట్టర్. రుణమాఫీకి బదులు వారి పంటలకు ధర పెంచి లాభాలు ఆర్జించేలా చేశామని అన్నారు. రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. హరియాణ రైతుల ఆదాయం పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే 'న్యాయ్'
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ న్యాయ్ పథకాన్ని ప్రకటించిందని ఆరోపించారు ఖట్టర్. దానికి అవసరమయ్యే భారీ నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారో స్పష్టత ఇవ్వలేదన్నారు. న్యాయ్‌ను అమలు చేయాలంటే మిగతా ప్రభుత్వ పథకాలకు కోత విధించక తప్పదని అభిప్రాయపడ్డారు హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్.
పది సీట్లలో గెలుపు భాజపాదే..
హరియాణలో 10 లోక్‌సభ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఖట్టర్. మే 12 పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి: అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస