దిల్లీలో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్. కరోనా బాధితులు ఏ రాష్ట్రానికి చెందినవారైనా.. దిల్లీ ఆసుపత్రులలో చికిత్స చేయించుకోవచ్చని స్పష్టం చేశారు. కొన్నిరోజుల క్రితం కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన దిల్లీ ఆసుపత్రులలో 'స్థానికులకు మాత్రమే చికిత్స' అనే ఆదేశాన్ని రద్దు చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. కరోనా బాధితులు దిల్లీయేతరులైనా తప్పనిసరిగా సరైన చికిత్సను అందించాలని సూచిస్తూ వైద్యశాఖను ఆదేశించారు.
దేశ రాజధాని ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆసుపత్రుల్లో ఉన్న పడకలు సరిపోవనే ఉద్దేశంతోనే తాము దిల్లీవాసులకు మాత్రమే చికిత్స అనే నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన విపత్తు నియంత్రణ అధికార యంత్రాంగంతో నిర్వహించిన సమావేశానికి ఉపముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా హాజరయ్యారు.
అద్భుత చర్య..
కేజ్రీవాల్ ప్రభుత్వ ఆదేశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేయడాన్ని భాజపా ఎంపీ గౌతం గంభీర్ స్వాగతించారు. అది ఒక అద్భుతమైన చర్యగా అభివర్ణించారు. కరోనా కష్టకాలంలో ఆప్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులను భయబ్రాంతులను గురిచేస్తోందని మండిపడ్డారు. కాగా ఇప్పటివరకు దేశ రాజధానిలో 28,936 కేసులు నమోదు కాగా 812 మందిని కరోనా బలితీసుకుంది.
ఆప్ విమర్శలు..
లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో పెద్ద సమస్య ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు సీఎం కేజ్రీవాల్. కొవిడ్-19 విజృంభిస్తున్న తరుణంలో ఇతర ప్రాంతాల వారికీ చికిత్సతో ఆస్పత్రులు, సౌకర్యాల కల్పన వంటి విషయంలో సమస్యలు తలెత్తుతాయన్నారు. భాజపా ఒత్తిడితోనే ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. రాజకీయాలు మనుకొని రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు.
ఇదీ చూడండి: 'చైనాతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి'