అన్‌లాక్ 3.0కు సంబంధించి కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ బ్రేక్ వేశారు. హోటళ్లు, వారపు మార్కెట్లు ప్రయోగాత్మకంగా తెరవాలని దిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చారు.
ఇటీవల అన్‌లాక్ 3.0కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా దిల్లీలో హోటళ్లు, వారపు మార్కెట్లు ప్రయోగాత్మకంగా తెరవాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
దీనిపై శనివారం ఉత్తర్వులు ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వం భావిస్తున్న వేళ వీటిని తెరిచేందుకు అనిల్ బైజాల్ ససేమిరా అన్నారు. ఆయన నేతృత్వంలో జరిగిన విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశంలో వాటిని తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకున్నారు.
గతంలోనూ..
గతంలో దిల్లీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఎల్‌జీ అడ్డుకున్నారు. దీంతో ఆయన అధికార పరిధి పట్ల విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఇదీ చూడండి: తాళ్లతో లాక్కెళ్లి కరోనా మృతుడి అంత్యక్రియలు!