చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడరాదంటూనే ఇరుదేశాల మధ్య కుదిరిన దౌత్యపరమైన ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
ఆగస్టు 29, 30 తేదీల్లో రాత్రి వేళల్లో యథాతథ స్థితిని దెబ్బతీసేందుకు రెచ్చగొట్టేలా డ్రాగన్ బలగాలు చర్యలు చేపట్టాయని భారత సైన్యం తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంట సైనిక కార్యకలాపాల్ని మళ్లీ ప్రారంభించినట్లు తెలిపింది.
అయితే చైనా కుట్రను దీటుగా ఎదుర్కొనేందుకు ప్యాంగాంగ్ దక్షిణ ప్రాంతంలో పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు భారత సైన్యం ప్రజా సంబంధాల అధికారి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. చర్చల ద్వారా శాంతిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని.. అదే సమయంలో ప్రాదేశిక సమగ్రతను కాపాడటం తమ కర్తవ్యమని సైన్యం స్పష్టం చేసింది. తాజా ఘటన నేపథ్యంలో సరిహద్దులో ఉన్న చుశుల్లో కమాండర్ స్థాయి అధికారులు సమావేశమై సమస్య పరిష్కారంపై చర్చిస్తున్నారు.
ఆ తర్వాత ఇదే..
జూన్ 15 గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనా దుందుడుకు చర్యల్లో ఇదే పెద్ద ఘటన అని భారత సైన్యం అభిప్రాయపడింది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించగా.. చైనా జవాన్లు కూడా పెద్ద సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికా నిఘావర్గాలు వెల్లడించాయి. అయితే చైనా ఇప్పటివరకు ఆ విషయాన్ని ధ్రువీకరించలేదు. కానీ, ఇటీవలే చైనాలో ఓ జవాను సమాధిపై గల్వాన్ లోయలో చనిపోయిన అమరవీరుడంటూ మాండరిన్ భాషలో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాజకీయ రగడ..
చైనా తాజా దూకుడుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తలెత్తింది. దేశ సార్వభౌమత్వంపై దాడి జరిగిందని, చైనా సైన్యం ప్రతీరోజు భారత్‌లోకి చొరబాటు ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. లద్దాఖ్ ఘర్షణలు ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ వరకు వ్యాపించాయని ఆరోపించింది.
చైనాపై ప్రధాని మోదీ ఎప్పుడు కన్నెర్రజేస్తారని కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ఎల్ఏసీ వెంట యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉంటే... వాస్తవ పరిస్థితిని ఒప్పుకునేందుకు కూడా భాజపా ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని మరో ప్రతినిధి జైవీర్ షెర్గిల్ దుయ్యబట్టారు.
తిప్పికొట్టిన భాజపా..
అయితే కాంగ్రెస్ వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా ఖండించింది. పొరుగుదేశాల కుట్రలను అడ్డుకొని భారత సైన్యం దేశ సమగ్రతను కాపాడుతున్నప్పటికీ.. ప్రతిపక్షం ఎందుకు కన్నీరు కారుస్తోందని మండిపడింది.
చైనాపై ఎప్పుడు కన్నెర్ర చేస్తారని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా చేసిన వ్యాఖ్యలపై భాజపా ప్రతినిధి సంబిత్ పాత్ర తీవ్రంగా స్పందించారు. మోదీ ఎప్పుడో చైనాపై కన్నెర్ర చేశారని.. కాంగ్రెస్ ఎందుకు తేమ కళ్లతో చూస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చైనా సమస్య ఒక పార్టీకి సంబంధించినది కాదని, మొత్తం దేశానిదని పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వం, భారత సైన్యం ఉన్నంత వరకు దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ఢోకా లేదని స్పష్టంచేశారు.
చర్చలకు విఘాతం
తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్, చైనా మధ్య గత రెండున్నర నెలలుగా చర్చలు కొనసాగుతున్న చర్చలు చైనా వైఖరితో ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. జూలై 6 న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూన్ నేతృత్వంలో ఫోన్‌లో చర్చలు జరిగాయి. జూలై చివరి నాటికి.. ఉద్రిక్తతలకు ముగింపు పలకాని ఆనాటి చర్చల్లో నిర్ణయించారు. ఆ తర్వాత పలుస్థాయిల్లో జరిగిన చర్చల్లో ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణకు అంగీకరించింది. అయినా ఆ ప్రక్రియ ఇంకా ముందుకు సాగడం లేదు. తాజాగా చైనా తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది.
ఇదీ చదవండి- హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్