కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా నిలుస్తోన్న కొందరు.. తమవంతు సాయంగా కూరగాయలు, సరుకులు అందిస్తున్నారు.
అయితే హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన ఓ యువకుడు మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. రైతులకు తనదైన శైలిలో మద్దతు తెలపాలని అనుకున్నాడు. ఆందోళనలు జరిగే చోట రైతుల కోసం ఓ సెలూన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించాడు. అంతే... మరోమారు ఆలోచించకుండా తన పనివాళ్లతో కలిసి సింఘూ సరిహద్దుకు చేరుకున్నాడు.
"కురుక్షేత్రలో నా సెలూన్‌కు వచ్చేవాళ్లలో 90శాతం మంది రైతులే. వారంతా ఆందోళనలో పాల్గొనేందుకు సింఘూ సరిహద్దుకు వచ్చారు. వారికి నా వంతు సాయం అందించేందుకు నేనూ ఇక్కడికే వచ్చాను. కురుక్షేత్రలో సెలూన్ మూసేసి.. ఇక్కడ ఉచితంగా వారికి నా సేవలు అందించాలని నిర్ణయించుకున్నా. ఆందోళన ముగిసేంతవరకూ నేను, నా సెలూన్ సిబ్బంది ఇక్కడే ఉంటాం."
-లబ్ సింగ్, సెలూన్ ఓనర్.
రైతులకు మద్దతుగా నిలిచేందుకు వచ్చిన లబ్ సింగ్ సరిహద్దుల్లో తన సేవలు అందించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. తన దగ్గర పనిచేసేవాళ్లకు.. తన సొంత డబ్బులను జీతంగా ఇస్తానన్నాడు.
"చాలా రోజుల నుంచి నేను సెలూన్ నడుపుతున్నాను. భగవంతుని దీవెనల వల్ల ఆర్థికంగా బాగానే ఉన్నాను. సెలూన్లో పనిచేసే వారికి జీతాలు ఇవ్వడానికి నేను ఇన్ని రోజులు ఆదా చేసిన డబ్బు సరిపోతుంది."
-లబ్ సింగ్, సెలూన్ ఓనర్.
తమ కోసం సెలూన్ ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందిస్తున్న లబ్సింగ్ను ప్రశంసిస్తున్నారు సింఘూ సరిహద్దుల్లోని పంజాబ్, హరియాణా రైతులు.
ఇదీ చదవండి: రైతులకు మద్దతుగా తమిళ విపక్షాల దీక్ష