మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంగా భాజపా శ్రేణుల్లో హుషారు పెరిగింది. అదే జోరులో ఉత్తర్ప్రదేశ్ ముజఫర్నగర్లోని కథువాలీ శాసన సభ్యుడు విక్రమ్ సైని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై దేశ వ్యాప్తంగా ఒకే జెండా ఎగురుతుంది. కశ్మీర్లోని ఆడపిల్లలను పెళ్లి చేసుకోండి అంటూ భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆర్టికల్ 370, 35A రద్దును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగం వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడంపై మాట్లాడుతూ... భాజపా బ్రహ్మచారి కార్యకర్తలు ఇప్పుడు కశ్మీర్లో స్థలాలు కొనుక్కుని, అక్కడి అందమైన అమ్మాయిలను పెళ్లిళ్లూ చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
"కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు.. పెళ్లి కానీ బ్రహ్మచారులెవారుంటే ఏ షరతులు లేకుండా అక్కడి వారితో వివాహం జరిపించేద్దాం.. ఇప్పుడక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూర్చున్న ముస్లింలు సంతోషపడాలి. వెళ్లి కశ్మీర్ తెల్ల అమ్మాలను పెళ్లి చేసుకోండి. హిందూ, ముస్లిం అందరూ ఆనందించాల్సిన విషయం ఇది "- విక్రమ్ సైని, కథువాలీ ఎమ్మెల్యే
మహిళలను కించపరిచారని విమర్శలు వస్తున్నా, ఆయన మాత్రం ఈ వ్యాఖ్యలు సరైనవేనని సమర్ధించుకున్నారు.
"అవును అన్నాను. ఇప్పుడు ఎవరైనా కశ్మీరీ అమ్మాయిలను బేషరుతుగా పెళ్లి చేసుకోవచ్చు అని అన్నాను. అదే నిజం కూడా. ఇది కశ్మీరీల స్వాతంత్రం. ఇంతకుముందు 35ఏ ఉండడం వల్ల అక్కడి అమ్మాయిలు ఇతర రాష్ట్రాల వారిని పెళ్లాడితే పౌరసత్వం కోల్పోయేవారు. మహిళల పట్ల జరిగిన అన్యాయాలను తొలగించారు అమిత్షా. ఇప్పుడు వారికి స్వేచ్ఛ లభించింది. అందుకే వారు సంబరాలు చేసుకుంటున్నారు."
-కథువాలీ ఎమ్మెల్యే
ఇదీ చూడండి:'మా నాన్నలా అవ్వొద్దు.. భోంచేసి హెల్మెట్ తీసుకెళ్లండి'