కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన మోటార్ వాహనాల చట్టంపై వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిని పాటించడం లేదు. కేంద్రం నిర్ణయించిన జరిమానాలపై ఇటీవలే గుజరాత్ ప్రభుత్వం పెద్దమొత్తంలో కోత విధించింది.
తాజాగా భాజపా నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం సైతం ఈ అంశంలో గుజరాత్‌నే అనుసరించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప... గుజరాత్ పాటిస్తున్న విధానాన్ని అనుసరించాలని అధికారులను ఆదేశించారు.
2019 జులై 31న మోటార్ వాహనాల సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం కేంద్రం నిర్ణయించిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. అయితే.. సామాన్యుడిపై భారం పడుతుందన్న అధికారుల అభిప్రాయం మేరకు.. తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని ప్రకటించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మహారాష్ట్రలోనూ మోటార్ వాహనాల చట్టం అమలును.. తాత్కాలికంగా నిలిపి వేసినట్లు రాష్ట్ర రవాణా మంత్రి దివాకర్ రావత్ వెల్లడించారు.
నూతన ట్రాఫిక్ నిబంధనల ప్రకారం హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోతే.. రూ.1,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది రూ.100గా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే.. రూ.5,000 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.