కర్ణాటకలో కొద్దిరోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి మంగళవారం వరకు తెరపడే అవకాశం లేదు. రాజీనామాలు, అనర్హత వేటు అభ్యర్థనల వ్యవహారంపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడమే ఇందుకు కారణం.
వాడీవేడి వాదనలు...
తమ రాజీనామాలు ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు వేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. రెబల్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. "స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే రాజీనామాలపై నిర్ణయం తీసుకోలేదు. రెబల్స్ పార్టీ విప్ ధిక్కరించేలా చేయాలన్నదే ఆయన ఆలోచన" అని వాదించారు రోహత్గీ.
సుప్రీం ప్రశ్న...
"రాజీనామాల ఆమోదంపై తమ తీర్పును సవాలు చేసే అధికారం స్పీకర్‌కు ఉందా?" అని సభాపతి రమేశ్ కుమార్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
కూటమి తరఫున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. స్పీకర్ వైఖరిని సమర్థిస్తూ కొన్ని నిబంధనలు ప్రస్తావించారు. ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నారని గుర్తుచేశారు.
రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వెనుక ఉన్న ఉద్దేశం వేరని కోర్టుకు సింఘ్వీ నివేదించారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే వారు రాజీనామా చేశారని తెలిపారు.
రెబల్స్ పిటిషన్‌పై స్పీకర్‌కు నోటీసులు ఇవ్వకుండా.... రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడంపై కూటమి తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.
గడువు ఇవ్వండి...
రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు ఒకటి-రెండు రోజులు గడువు ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును కోరారు. అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని విన్నవించారు.
మంగళవారం వరకు...
వాదనలు విన్న సుప్రీంకోర్టు... మంగళవారం వరకు యథాస్థితి కొనసాగుతుందని స్పష్టంచేసింది.
ఇదీ చూడండి: సభలో బలనిరూపణకు సిద్ధమైన కుమారస్వామి