కర్ణాటక రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బళ్లారి జిల్లా విజయనగర శాసనసభ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలీ రాజీనామా పత్రాలను స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్‌కు సమర్పించారు. ఇరువురి రాజీనామాతో కాంగ్రెస్‌లోని అసమ్మతి ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు మళ్లీ పుంజుకుందనే ఊహాగానాలు పెరిగాయి.
ప్రస్తుత పరిణామాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఈ నెల 8న తిరిగి రానున్నారు.
మంత్రి పదవి ఆశించిన వారిలో సింగ్ ఉన్నారు. గత ఏడాది కాంగ్రెస్ అధిష్ఠానం తనకు పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ చేపట్టినా ఆయనకు పదవి దక్కలేదు. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారనేది మరో వాదన.
రాజీనామా వెనుక రాజ్‌నాథ్?
ఆనంద్ సింగ్ రాజీనామా వెనుక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హస్తం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'ఆపరేషన్ కమలం' చేపట్టిన నుంచి రాజ్‌నాథ్‌ను ఆనంద్ సింగ్ కలుస్తుండటమే ఈ ఊహాగానాలకు కారణంగా తెలుస్తోంది. రాజీనామా చేసే ముందు కేంద్ర మంత్రిని సింగ్ కలిసినట్లు అతని అనుచరులు పేర్కొన్నారు.
కుమారస్వామి దృష్టి
అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా కలలు కంటోందని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'భుట్టో' బుట్టలో పడిపోయాం: నట్వర్ సింగ్