దుష్యంత్ చౌతాలా... జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నేత. ఇప్పుడు దేశ ప్రజలందరి చూపు ఆయన వైపే. హరియాణా ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మెజారిటీ రాని పరిస్థితుల్లో చౌతాలా కింగ్‌మేకర్‌గా మారారు. ఈ నేపథ్యంలో అగ్ర పార్టీలు చౌతాలాతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
జేజేపీ మద్దతు ఎవరికి అన్న అంశంపై సర్వత్రా విస్తృత చర్చ జరుగుతున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు దుష్యంత్. భాజపాకు దూరంగా ఉండొచ్చనే సంకేతాలిచ్చారు.
"ఇప్పుడప్పుడే ఏం చెప్పలేం. ముందు మా ఎమ్మెల్యేలతో సమావేశమవ్వాలి. ఈ విషయంపై చర్చించాలి. శాసనసభాపక్ష నేత ఎవరనే అంశంపై మాట్లాడాలి. ఆ తర్వాత మద్దతుపై స్పందిస్తాం. కానీ హరియాణా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఖట్టర్ ప్రభుత్వాంపై ఉన్న వ్యతిరేకతకు ఈ ఫలితాలే నిదర్శనం."
--- దుష్యంత్ చౌతాలా, జేజేపీ నేత
స్థాపించిన 10నెలలకే జేజేపీ రాష్ట్ర రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం లభించింది. తమకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చిన వారికే మద్దతిస్తామని ఇప్పటికే చౌతాలా స్పష్టం చేశారు.