శీతాకాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో హిమాలయ పర్వత సానువుల్లో శాంతి నెలకొల్పేందుకు భారత్-చైనా మరోసారి సైనిక చర్చలు నిర్వహించనున్నాయి. వచ్చేవారం ఏడో విడత కమాండర్ స్థాయి భేటీ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి- అటు చైనా.. ఇటు శీతాకాలం.. భారత్ దేనికైనా రె'ఢీ'
చైనా సైన్యంతో జరిగే ఈ సమావేశంలో 14 కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ భారత్ తరఫున చర్చలకు నేతృత్వం వహిస్తారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. భారత మిలిటరీ అకాడమీ(ఐఎంఏ)లో సేవలందించేందుకు లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ త్వరలో దెహ్రాదూన్‌కు వెళ్లనున్న నేపథ్యంలో 14వ కార్ప్స్ కమాండర్‌గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్ కూడా చర్చలకు హాజరవుతారని పేర్కొన్నారు.
"పీఎల్ఏతో చర్చలకు హాజరయ్యే బృందంలో 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ సహా పలువురు ఉన్నారు. ఐఎంఏ కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ దెహ్రాదూన్‌కు వెళ్లనున్నారు. అందువల్ల, పరిస్థితులపై అవగాహన కోసం చివరిసారి(సెప్టెంబర్ 21న) జరిగిన సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ మేనన్ సైనిక చర్చలకు హాజరయ్యారు."
-అధికారులు
ప్రస్తుతం ఐఎంఏ కమాండెంట్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ జైవీర్ సింగ్ నేగి బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. అయితే సరిహద్దులో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా ఐఎంఏకి వెళ్లేందుకు లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ మరికొంత సమయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ ఐఎంఏకి పయనమైన తర్వాత 14 కార్ప్స్ కమాండర్‌గా లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ పగ్గాలు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి- చైనా తీరు మారే వరకు.. ఆ శిఖరాలపైనే పాగా!
సరిహద్దు ఉద్రిక్తతలపై ఇప్పటివరకు ఆరుసార్లు కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. పరిస్థితి మెరుగుపడేందుకు కార్యచరణ రూపొందించడంలో ఈ సమావేశాలు సరైన ఫలితాలు ఇవ్వలేదు. అందుకు విరుద్ధంగా చైనా మరింత దూకుడు వైఖరితో ప్రవర్తిస్తోంది. పరిస్థితిని మరింత దిగజార్చే ప్రయత్నాలు చేస్తోంది. 1959లో చైనా ప్రధాని చౌ ఎన్లై అప్పటి భారత ప్రధాని జనవహార్లాల్ నెహ్రూకు రాసిన లేఖ ఆధారంగానే వాస్తవాధీన రేఖను పరిగణిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. చౌ ఎన్లై చేసిన ఏకపక్ష ప్రతిపాదననే ప్రధానంగా తీసుకొని భూభాగాల పునరుద్ధరణ చేయాలని వక్రభాష్యాలు చెబుతోంది.
భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది చైనా. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్ ఏర్పాటు చేయడాన్ని చైనా గుర్తించదని ప్రకటించింది. సరిహద్దులో సైనిక వసతుల కోసం మౌలిక సదుపాయాల కల్పన చేయడాన్ని తప్పుబట్టింది.
ఇదీ చదవండి- లద్దాఖ్ యూటీ ఏర్పాటును గుర్తించం: చైనా
ఇదిలా ఉండగా.. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను నివారించేందుకు సైనిక స్థాయిలో కాకుండా విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల ద్వారా చర్చలు జరిగాయి. భారత్-చైనా సరిహద్దుపై ఏర్పాటైన వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమావేశం సెప్టెంబర్ 30న జరిగింది. 19వ సారి జరిగిన ఈ భేటీలో వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
(రచయిత-సంజీవ్ బారువా)