కేరళలో ఐదేళ్లకోసారి అధికారం చేతులు మారుతూ ఉంటుంది. ప్రజలు ఒకసారి వామపక్షాలతో కూడిన లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్‌కు పట్టం కడితే.. మరోసారి కాంగ్రెస్, ఐయూఎంఎల్ తదితర పార్టీల కూటమి యూడీఎఫ్‌కు అధికారమివ్వడం సంప్రదాయంగా కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎప్పటికప్పుడు విలక్షణ తీర్పు ఇస్తుంటారు కేరళ ఓటర్లు. అందుకు నిదర్శనంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్కు బదులు ఈసారి యూడీఎఫ్‌కు అత్యధిక స్థానాల్లో జై కొట్టారు.
కలిసొచ్చిన రాహుల్ పోటీ..
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయటమూ యూడీఎఫ్‌కు కలిసొచ్చింది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి కావటం వల్ల ఆ ప్రభావం చాలా చోట్ల కనిపించింది. వయనాడ్, కోజికోడ్, మళ్లపురంతో సహా మరి కొన్నిచోట్ల కాంగ్రెస్‌పై సానుకూలత ఏర్పడింది. మధ్య కేరళలో మాత్రం గట్టి పోటీ ఎదురైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన స్థానాల్లోనూ యూడీఎఫ్ మంచి ఫలితాలు రాబట్టుకోగలిగింది.
అభ్యర్థుల ఎంపిక...
అన్నిస్థానాల్లో గట్టి అభ్యర్థులను నిలబెట్టటమూ యూడీఎఫ్‌కు సానుకూలంగా మారింది. అత్యధిక స్థానాల్లో విజయ పతాక ఎగరేయటానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. వీటికి తోడు శబరిమల వివాదం ఎల్‌డీఎఫ్ విజయావకాశాలకు గండి కొట్టిందనే చెప్పాలి. సుప్రీం తీర్పు అమలు చేయటం పట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి. ఇది యూడీఎఫ్‌కు కలిసొచ్చింది.
ఎల్డీఎఫ్పై వ్యతిరేకత...
భాజపా, ఎల్‌డీఎఫ్ వ్యతిరేక ఓట్లు తమకే దక్కుతాయని మొదటి నుంచి యూడీఎఫ్ ధీమాగా ఉంది. మైనార్టీ ఓటు బ్యాంకు ఈ కూటమికే మద్దతు పలికినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం వస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని చేసిన ప్రచారం సానుకూల ఫలితాలు ఇచ్చింది. భాజపా, స్థానిక వామపక్ష ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కేరళ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించింది యూడీఎఫ్.
ఓట్లు రాబట్టడంలో సఫలం..
నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా కేరళలో రబ్బరు, కొబ్బరి పరిశ్రమలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. నోట్ల రద్దు కారణంగా పర్యటక రంగానికి చాలా నష్టం జరిగింది. వీటి కారణంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. అది ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందని యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ అంచనా వేశాయి. ఆ ఓట్లు తమకే దక్కుతాయని.. యూడీఎఫ్ గట్టిగానే ప్రచారం చేసుకుంది. ఈ వాదనను ఎల్‌డీఎఫ్ కొట్టి పారేసినా చివరికి యూడీఎఫ్ అంచనాలే నిజమయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రాబట్టుకోవటంలో యూడీఎఫ్ విజయం సాధించింది.
ఇదీ చూడండి: ఆనంద సంద్రంలో 'కాషాయ భారతం'