మందుబాబులకు ఊరటనిచ్చేలా కేరళ ప్రభుత్వం తీసుకున్న 'లిక్కర్ పాసులు జారీ' నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. 3 వారాల పాటు ఈ నిలుపుదల కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది జస్టిస్ ఏకే జయశంకరన్, జస్టిస్ షాజీ సభ్యులుగా గల ధర్మాసనం.
దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ కారణంగా.. మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ కారణంతో మందు చుక్క లేక విలవిల్లాడుతున్నారు ప్రజలు. కేరళలో ఇటీవల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు మందు బాబులకు మద్యం విక్రయించేలా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
ఐఎంఏ వ్యతిరేకం..
సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. కేరళ ప్రభుత్వ వైద్య అధికారుల సంఘం(కేజీఎంఓఏ) హైకోర్టుకు వెళ్లింది. అంతకుముందు.. మందు బానిసలకు మద్యం అందించాలన్న కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) కూడా వ్యతిరేకించింది.
మద్యం లేక బలహీనతకు గురైతే ఆసుపత్రిలో చికిత్స అందించాలి కానీ, మద్యం ఇవ్వడం శాస్త్రీయంగా సరికాదని హితవు పలికింది ఐఎంఏ.