ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు కేరళలో దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 15 మంది ఉగ్రవాదులు శ్రీలంక నుంచి లక్షదీవులకు పడవలో బయలుదేరినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. అప్రమత్తమైన పోలీసులు తీరప్రాంతాల్లో భద్రత పెంచారు.
అనుమానాస్పద పడవలపై నిఘా ఉంచాలని తీరప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లకు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. అప్రమత్తంగా ఉండాలనే సందేశాలు సాధారణమే అయినా ఈ సారి ఉగ్రవాదుల సంఖ్యపై పక్కా సమాచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నిరంతరం అప్రమత్తం..
శ్రీలంక నిఘావర్గాల సమాచారం మేరకు మే 23 నుంచే అప్రమత్తంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు.
"శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటన జరిగినప్పటి నుంచీ మేము అప్రమత్తంగానే ఉన్నాం. ఇప్పుడు చేపల వేటకు వెళ్లే పడవల యజమానులను, ఇతరులను అప్రమత్తం చేశాం."- కేరళ తీరప్రాంత గస్తీదళాలు
శ్రీలంకలో జరిగిన వరుస ఆత్మాహుతి బాంబు పేలుళ్ల తర్వాత కేరళలోనూ ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు కేరళ వాసులు కొందరికి ఐసిస్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.
ఇదీ జరిగింది..
శ్రీలంకలో ఏప్రిల్ 21న వరుస బాంబుదాడులు జరిగాయి. ఈ ఉగ్రదాడిలో సుమారు 250 మంది మరణించగా, మరెంతో మంది క్షతగాత్రులయ్యారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ ప్రకటించింది.
ఇదీ చూడండి: కశ్మీర్ లోయలో సద్దుమణిగిన ఉద్రిక్తతలు