దేశ రాజధానిలో వాయునాణ్యత మంగళవారం తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నెల 27వరకు కాలుష్యానికి ప్రధాన కారణం పంజాబ్, హరియాణాల్లో వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతేనని దిల్లీ ప్రభుత్వం ఆరోపించింది.
ఈ నేపథ్యంలోనే కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు కేజ్రీవాల్.
"దిల్లీ ప్రజల తరఫున పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకుంటున్నా. దేశ రాజధాని ఓ గ్యాస్ ఛాంబర్‌గా మారకముందే కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. మా తరఫు నుంచి సాధ్యమైనంత వరకు కృషి చేస్తున్నాం. "
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం
ప్రభుత్వ ప్రకటన
దేశ రాజధానిలో కాలుష్యానికి సంబంధించి దిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నాసా తాజా చిత్రాల ప్రకారం పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాల ధూళి దిల్లీని చేరుతోందని తెలిపింది.
"గత 24 గంటల వ్యవధిలో హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో 2,577 వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేశారు. ఈ చర్య దిల్లీ ప్రజలపై ప్రభావం పడుతోంది. వాయువ్య దిశగా గాలులు వీస్తుండటం వల్ల దిల్లీలో వాయునాణ్యత క్షీణిస్తోంది."
-దిల్లీ ప్రభుత్వం
దిల్లీలో ఈరోజు వాయునాణ్యత భారీగా క్షీణించింది. ఆనంద్‌విహార్‌లో అత్యధికంగా వాయునాణ్యత సూచీ(ఏక్యూఐ) ప్రమాదకర స్థాయిలో 436కు పడిపోయింది. నెహ్రూ నగర్లో 430కి చేరింది.