ఆర్టికల్ 370 రద్దు చేసిన నాలుగు నెలల్లో కశ్మీర్ ఆర్థికవ్యవస్థ రూ.17,878 కోట్ల నష్టాన్ని చవిచూసిందని కశ్మీర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కేసీసీఐ) నివేదిక వెల్లడించింది.
2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసి, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అప్పటి నుంచి వివిధ రంగాల వారీగా ఏర్పడిన నష్టాలను... 2017-18 స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా గణించి నివేదిక రూపొందించినట్లు కేసీసీఐ స్పష్టం చేసింది.
"జమ్ముకశ్మీర్‌లో సుమారు 55 శాతం జనాభా కలిగిన 10 జిల్లాల్లో ఈ అధ్యయనం చేశాం. 120 రోజుల్లో ఈ గణాంకాలను సేకరించాం. దీని ప్రకారం, కశ్మీర్ ఆర్థికవ్యవస్థ రూ.17,878.18 కోట్ల నష్టాన్ని చవిచూసింది." - కేసీసీఐ నివేదిక
లక్షల ఉద్యోగాలు పోతున్నాయ్..
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపు, తదనంతర పరిణామాల మూలంగా లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారని నివేదిక వెల్లడించింది.
పరిశ్రమలు మూతపడుతున్నాయ్..
వివిధ సంస్థలు రుణం తీర్చే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయని, గణనీయమైన సంఖ్యలో వ్యాపార సంస్థలు మూతపడడం లేదా మూసివేయాలనే ఆలోచనతో ఉన్నాయని నివేదిక చెబుతోంది.
"ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ-కామర్స్‌పై నేరుగా ఆధారపడే రంగాలు నాశనమయ్యాయి. ఉద్యానరంగానికి ప్రభుత్వం రూ.8,000 కోట్లు కేటాయించింది. దీని వల్ల ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం పోయింది. ఫలితంగా యాపిల్ ధరల మధ్య గందరగోళం ఏర్పడి.. రైతులు భయాందోళనలకు గురవుతున్నారు." - కేసీసీఐ
ఆదుకొనే ఆలోచనే లేదు..
నష్టాలను అంచనా వేయడానికి లేదా నిస్సహాయ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని కేసీసీఐ నివేదిక తెలిపింది. పర్యాటక రంగం గందరగోళంలో ఉందని, చేతివృత్తులవారు, నేత కార్మికులు నిరుద్యోగులుగా మారుతున్నారని స్పష్టం చేసింది. తయారీ రంగం సుమారు రూ.2,520 కోట్ల నష్టంతో పూర్తిగా దెబ్బతిందని నివేదిక పేర్కొంది.