కర్ణాటక రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయంటూ భావ సారూప్యత ఉన్న ఎమ్మెల్యేలందరూ మంగళవారం జరిగే సమావేశానికి రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ పిలుపునిచ్చారు. అయితే ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ పెద్దలు ఆయనకు సూచించినట్టు సమాచారం. ఈ తరుణంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు సోమశేఖర్ ప్రకటించారు.
కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో చాలా కాలంగా భేదాభిప్రాయాలు బయటపడుతున్నాయి. అయితే అగ్రనేతలు మాత్రం అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నారు.
బెదిరింపు రాజకీయం కాదు
మంగళవారం సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే సోమశేఖర్. అయితే ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనుండడమే ఇందుకు కారణమన్నారు.
తాను బెదిరింపు రాజకీయాలకు పాల్పడట్లేదన్నారు సోమశేఖర్. ఎమ్మెల్యేలు నిశ్చయించిన సమావేశం ప్రభుత్వం, పార్టీకి వ్యతిరేకం కాదని తెలిపారు.
కానీ సంకీర్ణ ప్రభుత్వంతో కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఇలాంటి సమావేశాలు జరిపితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని... వాయిదా వేయాలని ఎమ్మెల్యేలను సీఎల్పీ నేత సిద్దరామయ్య కోరినట్టు సమాచారం.