కరోనా మహమ్మారి విజృంభించి, ప్రజల ప్రాణాలను బలిగొంటున్నా... కొంత మంది వ్యక్తులు మాత్రం తీవ్ర నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. లాక్డౌన్ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్నారు.
గోనె సంచులతో సన్మానం..
కర్ణాటక కొప్పల్ జిల్లాలోని అశోక సర్కిల్లో... చట్టాన్ని ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులకు పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గోనె సంచులతో తయారు చేసిన మాస్కు, గౌనులను వారికి తొడిగించారు. తప్పు చేసి శిక్ష అనుభవించిన వారితోనే... కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
నిజానికి ఈ గోనె సంచి వ్యక్తిగత రక్షణ ఉపకరణం-పీపీఈ కిట్ లాంటిది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ శిక్ష విధించడం వెనుక ఓ సందేశం ఉంది.
"సాధారణంగా పీపీఈ కిట్ ధరించి 15 నిమిషాలు కూడా మనం ఉండలేం. కానీ పోలీసులు, వైద్యులు మన కోసం నిరంతరం కష్టపడుతున్నారు. వారి కష్టం అందరికీ అర్థం కావాలన్నదే ఈ శిక్ష వెనుక ఉన్న ఉద్దేశం. దయ చేసి అనవసరంగా బయటకి రాకండి. భౌతిక దూరం పాటించండి."
- తప్పు చేసి శిక్ష అనుభవించిన వ్యక్తి
ఇదీ చూడండి: ట్రంప్ 'వలస'ల నిర్ణయంపై భారత్ అధ్యయనం!