కర్ణాటకలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. రూ.40లక్షల కోసం కట్టుకున్న భర్తనే అపహరించింది భార్య. ఇందుకోసం భర్తకు కరోనా సోకిందని అబద్ధం చెప్పిందామె. బాగులకుంటెలో జరిగిన ఈ కిడ్నాప్ కేసును బాధితుడు మిత్రుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఛేదించారు పోలీసులు. ఇందులో భాగమైన ఎనిమిది మందిలో.. ఐదుగురు నిందితుల(బాధితుడి భార్య సుప్రియ, లత, గగన్, బాలాజీ తేజస్, కిరణ్ కుమార్)ను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
కిడ్నాప్ ఎందుకంటే?
త్యాగరాజనగర్‌లో నివాసముంటోన్న సోమశేఖర్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. బెంగళూరులో ఇల్లు కొనేందుకు రూ. 40లక్షలు కూడబెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య సుప్రియ ఎలాగైనా ఆ సొమ్మును కాజేయాలని కుట్రపన్నింది. బంధువుల సాయంతో భర్తను కిడ్నాప్ చేయించింది.
ప్లాన్ చేసిందిలా..
నవంబర్ 1న తనకు కడుపు నొప్పిగా ఉందంటూ భర్తను పిలిపించింది సుప్రియ. ఇందుకోసం మందులు తీసుకురమ్మని చెప్పింది. ఆమె చెప్పినట్టుగా మెడికల్ షాప్‌లో మందులు కొని నడుస్తూ ఇంటికి వస్తుండగా.. సోమశేఖర్ వద్దకు ఓ అంబులెన్స్ వచ్చింది. 'మీరు కరోనా రోగి, ఆస్పత్రి నుంచి తప్పించుకు తిరుగుతున్నారు' అని చెప్పారా అత్యవసర వాహన సిబ్బంది. అదంతా అబద్ధమని అతడు ఎంత చెప్పినా వినకుండా.. బలవంతంగా అంబులెన్స్ ఎక్కించి అపహరించారు. అనంతరం అతడ్ని చామరాజనగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో బంధించారు.
ఆ తర్వాత స్నేహితుడి సాయంతో అతడి భార్య సుప్రియకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కిడ్నాపర్లు. వారు చెప్పినట్టుగానే సుప్రియకు రూ.10లక్షలు ఇమ్మని తన మిత్రుడితో చెప్పాడు సోమశేఖర్. అయితే.. ఈ విషయమై అనుమానం వ్యక్తం చేసిన స్నేహితుడు సుప్రియ ఇంటి వద్దకు వెళ్లి విచారించాడు. 'నా భర్త(సోమశేఖర్) కొవిడ్ బారినపడ్డాడు, అందుకే అతడ్ని మా బంధువు గగన్.. మాగాడి రోడ్ ఆస్పత్రిలో చేర్పించారు' అని బుకాయించింది సుప్రియ.
బయటపడిందిలా..
అయితే.. ఆమె మాట తీరుపై అనుమానంతో బాధితుడి మిత్రుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సుప్రియ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు పోలీసులు. ఈ విషయాన్ని వెంటనే తన సహచరులకు చెప్పిందామె. అలా ఇద్దరు నిందితులు(గగన్, ఆమె తల్లి లత) దొరికిపోయారు. బండారం మొత్తం బయటపడిపోయింది. వారు చెప్పిన వివరాల ప్రకారం.. బీబీఎంపీ(బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ)లో పనిచేస్తున్న లత(సుప్రియ తల్లి).. కరోనా డ్రామాకు తెరలేపింది.
ఇదీ చదవండి: రజనీ వెనకున్న ఆ 'రాజకీయ శక్తులు' ఎవరు?