కర్ణాటకలో 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో అధికారం కాపాడుకునే దిశగా ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి కుమారస్వామి. తిరుగుబాటు శాసనసభ్యుల ప్రతినిధి ఎమ్మెల్యే రామలింగారెడ్డితో బెంగళూరులోని ఓ రహస్య ప్రదేశంలో భేటీ అయ్యారు. రాజీనామాలు ఉపసంహరించుకోవాలని బుజ్జగించే ప్రయత్నం చేశారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి విజ్ఞప్తికి అంగీకరిస్తారా లేదా అన్న అంశంపై కూటమి సర్కారు భవిష్యత్తు ఆధారపడి ఉంది.
'అవసరమైతే పదవులు వదిలేస్తాం'
కర్ణాటక ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భారీ నజరానా ప్రకటించారు. రాజీనామాలు ఉపసంహరించుకుని తమతో కొనసాగితే మంత్రి పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రస్తుత మంత్రులు రాజీనామాలు చేసి తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తామన్నారు.
కాంగ్రెస్కు చెందిన మంత్రులతో బెంగళూరులో సమావేశమై, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు పరమేశ్వర.
ఇదీ చూడండి: 'కర్ణాటక సర్కార్' సంక్షోభం కొలిక్కివచ్చేనా?