కర్ణాటకలో భాజపా ప్రభుత్వ భవితవ్యాన్ని తేల్చే 15 శాసనసభ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనందున 66.59 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రధాన పార్టీల నుంచి 165 మంది అభ్యర్ధులు అదృష్టం పరీక్షించుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది శాసనసభ్యులు తిరుగుబాటు చేయడం వల్ల వారిపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు నిర్వహించారు.
15 స్థానాల్లో ఎన్నికలు పూర్తి కాగా.. న్యాయపరమైన వివాదాలతో మరో రెండు స్థానాల్లో పోలింగ్ వాయిదా వేశారు. అనర్హత వేటుకు గురై భాజపాలో చేరిన 17మంది రెబల్ ఎమ్మెల్యేలలో 13 మందిని ఆ పార్టీ ఉపఎన్నికల బరిలో నిలిపింది. భాజపా, కాంగ్రెస్ మొత్తం 15 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను పోటీకి దింపగా.. జేడీఎస్ 12 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఉప ఎన్నికలు యడియూరప్ప సర్కారుకు కీలకంగా మారాయి.
మొత్తం 225 స్థానాలున్న కర్ణాటకలో యెడ్డీ సర్కార్ మనుగడ సాగించాలంటే భాజపా కనీసం ఆరు సీట్లను గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కమలదళం ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ఫలితాలు ఈనెల 9న వెలువడనున్నాయి.
ఇదీ చదవండి:ఈ చేప ముఖం అచ్చం మనిషిలాగే ఉంది!